ఇప్పటికైనా దేవర టీవీలోకి వస్తుందా?
టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య రిలీజైన యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) దేవర (Devara) సినిమా ఇప్పటికీ శాటిలైట్ డీల్ పూర్తి కాకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు రిలీజ్కు ముందే టీవీ హక్కులు అమ్ముడైపోతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిర్మాతలు ఆశించిన ధరకు ఛానెల్స్ ముందుకు రాకపోవడంతో డీల్ ఆలస్యమైందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రముఖ ఛానెల్స్ చర్చలు జరిపినా ఒప్పందం ఫైనల్ కాలేదని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ రేసులో ఈటీవీ పేరు బలంగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం దేవర శాటిలైట్ రైట్స్ కోసం ఈటీవీ(ETV) యాజమాన్యం సీరియస్గా ప్రయత్నాలు చేస్తోందట. భారీ మొత్తాన్ని కాకపోయినా, మార్కెట్కు తగ్గ స్థాయిలో ఒక డీసెంట్ ఆఫర్ ఇచ్చినట్టు డిజిటల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో నిర్మాత కళ్యాణ్ రామ్(Kalyn Ram) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అంశంపై అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
అయితే ఈటీవీ పేరు వినగానే కొంతమంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ సినిమాల టెలివిజన్ ప్రీమియర్స్ ఎక్కువగా ఇతర ప్రముఖ ఛానెల్స్లోనే కనిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభ దశలో ఆయన సినిమాలకు ఈటీవీకి ప్రత్యేక అనుబంధం ఉంది. సింహాద్రి(Simhadri), అల్లరి రాముడు(Allari Ramudu) లాంటి సినిమాలు ఇప్పటికీ ఆ ఛానెల్ ద్వారానే ప్రేక్షకులకు గుర్తుంటాయి. ఇక దేవర ఓటిటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండటంతో, శాటిలైట్ ప్రీమియర్ కూడా భారీ స్థాయిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.







