ఇండస్ట్రీపై ప్రేమను చాటిన విజయ్.. రోజుకి ఐదు షోలు
తమిళ స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్(Vijay) ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ప్రస్తుతం పూర్తిగా పాలనాపరమైన బాధ్యతలతో బిజీగా ఉన్నారు. ఇకపై సినిమాల్లో నటించబోనని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన ఆఖరి సినిమా జన నాయగన్(Jana Nayagan) రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే సినీ రంగాన్ని పూర్తిగా దూరం పెట్టకుండా, పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడే కీలక నిర్ణయాలతో ముందుకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా తమిళనాడులోని థియేటర్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై విడుదలయ్యే ప్రతి తమిళ సినిమాకు తొలి వారం రోజులు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని విజయ్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు స్పెషల్ పర్మిషన్స్, ఎక్స్ట్రా డిస్కషన్స్ అవసరమైన ఈ విధానం ఇక సాధారణ ప్రక్రియగా మారనుంది. జూన్ నెల నుంచి విడుదలయ్యే అన్ని కొత్త తమిళ సినిమాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నిర్ణయం ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు, పెద్ద స్థాయి ఓపెనింగ్స్ ఆశించే నిర్మాతలకు గణనీయమైన ఊరటనివ్వనుంది. టికెట్ ధరలు పెంచకుండా అదనపు షోల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం పట్ల ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులకు కూడా మరిన్ని షోలు అందుబాటులో ఉండటంతో టికెట్లు సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమకు అనుకూలంగా విజయ్ తీసుకున్న తొలి పెద్ద నిర్ణయాల్లో ఇదొకటిగా కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.







