నెక్ట్స్ లెవెల్ లో ఉండనున్న పెద్ది ఓపెనింగ్ నెంబర్స్
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న పెద్ది(Peddi) రిలీజ్ కు కౌంట్‌డౌన్ మొదలవడంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే ఈ సినిమాకు అసాధారణ రెస్పాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ వేగం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు లొకేషన్లలో టికెట్లు వేగంగా అమ్ముడవుతుండటంతో, రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ అందుకునే సినిమాల్లో పెద్ది ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.
ఇక ఏపీ ప్రభుత్వం పెద్దికి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. జూన్ 3 రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతి లభించగా, ఆ షో టికెట్ ధరను జీఎస్టితో కలిపి రూ.600గా నిర్ణయించారు. అదే విధంగా రిలీజైన రోజు నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు అదనపు టికెట్ ధరలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో తొలి వారంలోనే భారీ గ్రాస్ సాధించే అవకాశాలు మరింత పెరిగాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తరహాలో అక్కడ కూడా టికెట్ ధరల పెంపు, అదనపు షోలు, ప్రీమియర్స్‌కు అనుమతులు లభిస్తే పెద్ది బాక్సాఫీస్ రేంజ్ మరో స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్‌తో భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ సినిమా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.







