80 మంది నృత్యార్చనతో అలరారిన అన్నమ స్వరార్చన
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం రాజేష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 80 మందికి పైగా నృత్య కళాకారులు భక్తిశ్రద్ధలతో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి నృత్య కైంకర్యం సమర్పించారు.
తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం రాజేష్ డాన్స్ అకాడమీ శిష్యులు “గణపతి తాళం, వినరో భాగ్యము, తొండర నిత్యకాని, పుష్పాంజలి, అదివో అల్లదివో, వేంకటాచల నిలయం, బ్రహ్మమొక్కటే, నారాయణతే, రామాయణ శబ్దం, బ్రహ్మమొక్కటే, గరుడ గమన, నమశ్శివాయతే” తదితర భక్తిరసభరితమైన నృత్య రూపకాలను లయ, తాళం, భావాభినయ సమన్వయంతో ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
అన్నమయ్య సంకీర్తనలలోని భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక సందేశాన్ని తమ అభినయం, హస్తముద్రలు, నృత్య కదలికల ద్వారా కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో భాగంగా 80 మందికి పైగా కళాకారులు సమిష్టిగా ప్రదర్శించిన నృత్య కైంకర్యం అన్నమయ్యపురంలో భక్తిరసాన్ని వెల్లివిరియజేసింది.
తదుపరి సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారితో కలిసి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన కళాకారులను శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికతో అభినందించి, అన్నమయ్య సంకీర్తనలను నృత్యరూపంలో భక్తులకు చేరువ చేస్తున్న రాజేష్ డాన్స్ అకాడమీ గురువులను ప్రశంసించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగించారు.








