హైదరాబాద్‌కు ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్?.. రోప్‌వేపై భారీ కసరత్తు
Hyderabad : సాధారణంగా రోప్‌వేలు కొండలు, పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇకపై హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రజా రవాణాకు, పర్యాటక రంగానికి ఉపయోగపడేలా సరికొత్త ప్రణాళిక సిద్ధమవుతోంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి మాస్ ట్రాన్సిట్ పద్ధతిలో రోప్‌వేలను అందుబాటులోకి తెచ్చేందుకు వారణాసి నమూనాను ఇక్కడ పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా – UMTA) దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు గాను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో ఈ ప్రాజెక్టులను నిర్మించాలని భావిస్తున్నారు. నగరంలోని మెట్రో, రైల్వే స్టేషన్ల నుండి సమీప వాణిజ్య, వ్యాపార సముదాయాలకు , పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఒక రోప్‌వే సర్క్యూట్ ఏర్పాటు చేయడం ఇందులో కీలకమైన అంశం.
ఇవి కూడా చదవండి
తొలి విడతలో గోల్కొండ నుండి టూంబ్స్ వరకు..
నగరంలో తొలుత ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోల్కొండ పక్కనే ఉన్న టూంబ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో రోప్‌వే ఏర్పాటుకు హెచ్ఎండీఏ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అక్కడి నుండి జూ పార్క్ వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర ఏరియల్ వ్యూ (ఆకాశ మార్గం) రోప్‌వేతో అనుసంధానం చేసే వీలుంది. ట్యాంక్‌బండ్ నుండి సంజీవయ్య పార్క్ వరకు కూడా రోప్‌వేను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
పాలసీలో మార్పులు..
ప్రైవేటు ఆస్తుల పైనుంచి ఈ రోప్‌వే మార్గాలు వెళ్లేటప్పుడు బాధితులకు తగిన పరిహారం అందించేలా పాలసీలో మార్పులు కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ (AOC) పరిధిలోని ప్రాంతాల నుండి క్లియరెన్స్ కోసం హెచ్ఎండీఏ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి.
వారణాసి మోడల్ విశేషాలు ..
దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్‌వే వ్యవస్థ వారణాసిలో రూపొందుతోంది. అక్కడ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుండి గోడోలియా చౌక్ వరకు 3.8 కిలోమీటర్ల మేర 5 స్టేషన్లతో పనులు జరుగుతున్నాయి. రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్ వల్ల 45 నిమిషాల నుండి గంట సమయం పట్టే ఈ దూరాన్ని, రోప్‌వే ద్వారా కేవలం 16 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీని ద్వారా రోజుకు 96 వేల మంది ప్రయాణించేలా డిజైన్ చేశారు. హైదరాబాద్‌లో కూడా వానాకాలంలో చిన్న దూరాలకు (2-3 కి.మీ) తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతుంటాయి. ఇలాంటి తక్కువ దూరాల ప్రయాణానికి రోప్‌వేలు ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను నిర్ణయిస్తే ఈ ప్రాజెక్టు నగరవాసులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి







