ఆర్టీఏపై ఏసీబీ సడన్ స్ట్రైక్.. లోపల చూసి అధికారులకే షాక్?
RTA: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (RTA) సాగుతున్న అవినీతి అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బుధవారం రోజు మేడ్చల్, కొండాపూర్, నాగోల్ ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో దరఖాస్తుదారులకు నేరుగా అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డులు నేరుగా ఏజెంట్ల చేతుల్లోకి వెళ్తున్నట్లు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.
ఏసీబీ తనిఖీల్లో తేలిన అంశాలు..
మేడ్చల్ కార్యాలయంలో..
ఒకే వ్యక్తి డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ వద్ద నాలుగు దరఖాస్తులతో ఉండటాన్ని అధికారులు గమనించారు. విచారణలో అతను ఒక డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడిగా తేలింది. డ్రైవింగ్ నేర్పించడంతో పాటు ఎల్ఎల్ఆర్ ఇప్పించేందుకు ఇతను అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కార్యాలయంలోని దరఖాస్తులను పరిశీలించగా, ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే నేరుగా ఏజెంట్ల పేర్లు, కోడ్ల ఆధారంగా ఫైళ్లను ప్రాసెస్ చేస్తున్నట్లు తేలింది.
ఇవి కూడా చదవండి
కొండాపూర్ కార్యాలయంలో..
నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను దరఖాస్తుదారులకు పంపించాల్సి ఉండగా, సిబ్బంది అలా చేయడం లేదు. అధికారులు ఇక్కడ ఏజెంట్ల నుంచి దాదాపు 150 ఆర్సీలు, డీఎల్‌లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ పరీక్షల సమయంలో దరఖాస్తుదారులను పాస్ చేయించేందుకు ఏజెంట్లు స్వయంగా డ్రైవింగ్ ట్రాక్ వద్దే తిష్ట వేస్తున్నట్లు వెల్లడైంది.
నాగోల్ కార్యాలయంలో..
లైసెన్సుల కోసం దరఖాస్తుదారుల తరపున వచ్చే ఏజెంట్లు కార్యాలయంలో యథేచ్ఛగా చెలామణి అవుతున్నారు. ఇక్కడ ఏడుగురు డ్రైవింగ్ స్కూల్ యజమానులను, 8 మంది ఇన్స్ట్రక్టర్లను గుర్తించి వారి నుంచి రూ. 41,130 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిస్పాచ్ సెక్షన్ సిబ్బంది దరఖాస్తుదారులకు పంపాల్సిన లైసెన్సులను నేరుగా ఏజెంట్లకే అందజేస్తున్నారు. సుధాకర్ రెడ్డి అనే ఏజెంట్ వద్ద ఏకంగా 184 లైసెన్సులు లభ్యమవడం గమనార్హం. బుధవారం వచ్చిన 185 దరఖాస్తుల్లో ఒక్కదాన్ని కూడా అధికారులు తిరస్కరించలేదు. వీటన్నింటిపై డ్రైవింగ్ స్కూల్ వాహనాల నంబర్లు ఉండటమే దీనికి కోడ్ లాంగ్వేజ్‌గా అధికారులు భావిస్తున్నారు. అలాగే డ్రైవింగ్ ట్రాక్‌పై అనధికారికంగా ఉన్న 11 కార్లను కూడా ఏసీబీ గుర్తించింది.
ఇవి కూడా చదవండి







