గ్రేటర్ ఫైట్.. ఇందిరమ్మ Vs డబుల్ బెడ్రూమ్!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, భవిష్యత్తు అసెంబ్లీ సమరమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది. హైదరాబాద్ నగరంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే.. వచ్చే రెండున్నరేళ్లలో తాము ఎక్కువ ఇళ్లు నిర్మించి చూపిస్తామని, అలా చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విసిరిన రాజకీయ సవాల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ సవాల్‌ను కేటీఆర్ స్వీకరిస్తారా అనే చర్చ జోరందుకుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇళ్ల పేరిట డ్రామాలు చేసిందని విమర్శిస్తూ.. కొన్ని గణాంకాలను తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం కేవలం 45వేల నుంచి 46వేల ఇళ్ల మాత్రమే నిర్మించిందని చెప్పారు. అందులో 20వేలకు పైగా ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. పూర్తయిన వాటిలో కూడా 16వేల పైచిలుకు ఇళ్లలో లబ్ధిదారులు నివసించలేని అధ్వాన్న స్థితిలో ఉన్నాయని తెలిపారు. తాము ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని, మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడగడానికి సిద్ధమా అని బీఆర్ఎస్కు నేరుగా సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, కాంగ్రెస్ ప్రభుత్వం నగర పేదల కోసం భారీ గృహ నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. అందుకోసం కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కేటాయించడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఓఆర్ఆర్ ఇన్నర్ పరిధిలోని క్యూర్ ఏరియాలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. మళ్లీ రెండో విడతలో పట్టణ ప్రాంతాలకు మరో లక్ష ఇళ్లను మంజూరు చేస్తారు. క్యూర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 12 రోజుల వ్యవధిలోనే 39 నుంచి 40 స్థలాలను అధికారులు గుర్తించారు. తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, గిరిజన ప్రాంతాలకు 5,000 ఇళ్లు ఇవ్వగా, ఇప్పుడు రెండో విడతగా మరో 2,000 ఇళ్లు మంజూరు చేశారు. దీనివల్ల ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 7,000 ఇళ్ల వరకు లభించనున్నాయి. ఈ ఇళ్లను లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా, ఉచితంగా ఆడబిడ్డల పేరిట ప్రభుత్వం స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుందని ప్రకటించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్ల క్రితం G+2 విధానంలో నిర్మించి, ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి అజహరుద్దీన్‌లతో కలిసి జియాగూడ పోలీస్ క్వార్టర్స్, మంగార్ బస్తీ బాంబే కాలనీ, నాంపల్లి రెడ్ హిల్స్ ఖాళీ స్థలాలు, మలక్‌పేట్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించి, త్వరితగతిన మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను టార్గెట్ చేస్తోంది. ఇటీవల నగరంలో పర్యటించిన కేటీఆర్.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరానికి 24 గంటలూ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, నగర ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ తన ‘డబుల్ బెడ్రూమ్’ మోడల్‌ను సమర్థించుకుంటుండగా, కాంగ్రెస్ ‘ఇందిరమ్మ ఇళ్ల’ వేగంతో చెక్ పెట్టాలని చూస్తోంది.
ఇవి కూడా చదవండి







