గాంధీభవన్‌లో గల్లీ ఫైట్.. క్రమశిక్షణా రాహిత్యం కాదా?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ, ఆ ప్రజాస్వామ్యం కాస్తా హద్దులు దాటి, నేతల మధ్య భౌతిక దాడులకు దారితీయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తూ ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటైన గాంధీభవన్ వేదికైంది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణ, పార్టీ క్రమశిక్షణను నిలువునా ప్రశ్నిస్తోంది.
ఇవి కూడా చదవండి
మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ వంటి కీలక నేతల సమక్షంలోనే ఈ హైడ్రామా నడవడం గమనార్హం. వేదికపై మంత్రి అజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలనే ‘ప్రొటోకాల్ వివాదం’ కాస్తా ఇద్దరు కీలక నేతల మధ్య అహంకారాల పోరాటంగా మారింది. నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీల మధ్య మొదట మాటల యుద్ధంగా ప్రారంభమైన వివాదం, క్షణాల వ్యవధిలోనే భౌతిక దాడిగా రూపాంతరం చెందింది.
ఉస్మాన్ అల్ హజ్రీ ఒక్కసారిగా ఫిరోజ్‌ఖాన్ చెంపపై కొట్టి తోసేయడంతో ఆయన కిందపడిపోయారు. ఒక బాధ్యతాయుతమైన పార్టీ ఆఫీస్‌లో, అదీ మంత్రుల కళ్ల ముందే ఒక నేతపై మరో నేత దాడికి తెగబడటం కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరిచింది. ఈ ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సీనియర్ నాయకుడు, వృద్ధుడైన వీహెచ్ ను సైతం పక్కకు తోసేయడం చూస్తే, అక్కడ క్రమశిక్షణ ఎంతలా దిగజారిందో అర్థమవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ తీవ్ర అసహనంతో సమావేశం నుంచి నిష్క్రమించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ మీటింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.
ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పార్టీ నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. జరిగిన అవమానాన్ని కప్పిపుచ్చుకుంటూ.. ఇది కేవలం ఒక చిన్న కుర్చీ వివాదమని, ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటివారని ఫిరోజ్ ఖాన్ సర్దిచెప్పారు. అంతటితో ఆగక, ఉస్మాన్ తనకు ముద్దు కూడా పెట్టారని, ఇదంతా తమ ఫ్యామిలీ గొడవ అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. మరోవైపు తాను ఫిరోజ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పానని, అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని ఉస్మాన్ సమర్థించుకున్నారు. అయితే వీడియోలో కేవలం తాను తోసిన దృశ్యాలు మాత్రమే వచ్చాయని, దానికి ముందు ఏం జరిగిందో రాలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అది కేవలం చిన్న అపార్థం మాత్రమేనని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. గొడవ జరిగిన వెంటనే ఇద్దరు నేతలు హగ్ చేసుకుని కలిసిపోయారని, అంతర్గత విషయాలను వక్రీకరించవద్దని హితవు పలికారు.
నాయకులు దీనిని ఎంతగా సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, గాంధీభవన్ వేదికగా జరిగిన ఈ ‘గల్లీ ఫైట్’ కాంగ్రెస్ క్రమశిక్షణను నిలువునా ముంచేసింది. సామాన్య కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే, మంత్రుల ముందే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తుంటే పార్టీ అధిష్టానం ఎందుకు మౌన ప్రేక్షక పాత్ర వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఈ ఇద్దరు నేతలపై పార్టీ పరంగా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ అనే మాటకు అర్థం మారిపోయి, అది ‘అంతర్గత అరాచకత్వం’గా మారే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి







