ఆకునూరి మురళి రాజీనామా వెనుక ఏం జరిగింది?
తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కార్కు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పదవీకాలం ముగియడానికి మరో నాలుగు నెలల సమయం ఉండగానే, ఆయన ఆకస్మికంగా తప్పుకోవడం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పైకి టాస్క్ కంప్లీట్ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నప్పటికీ, తెరవెనుక నడిచిన ఐఏఎస్ కోటరీ రాజకీయాలే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ జోరుగా సాగుతోంది. ఒక నిబద్ధత గల మాజీ అధికారికి, వ్యవస్థలోని అహంకారానికి మధ్య జరిగిన ఘర్షణే ఈ రాజీనామాకు దారితీసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో ఉన్న విద్యా రంగానికి సంబంధించిన లోపాలను ఎండగడుతూ ఆకునూరి మురళి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, కార్పొరేట్ విద్యా దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆయన కొన్ని కీలక సిఫార్సులు చేశారు. అయితే, ఆ నివేదిక ఇచ్చిన కొన్ని రోజులకే ఆయన రాజీనామా చేయడం వెనుక తీవ్రమైన అసంతృప్తి దాగి ఉందన్నది జగమెరిగిన సత్యం. సంస్కరణలు కాగితాలకే పరిమితమవుతుండటం, క్షేత్రస్థాయి వాస్తవాలను సర్కార్ లైట్ తీసుకోవడం మురళిని తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది.
విద్యాశాఖకు బాస్ గా ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వైఖరే మురళి రాజీనామాకు ప్రధాన కారణమని సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న పాత ‘సర్వీస్’ విభేదాలు ఈ విద్యా కమిషన్ వేదికగా మరింత ముదిరాయని టాక్. చైర్మన్ హోదాలో మురళి ఇచ్చిన సలహాలు, సూచనలను సదరు అధికారి కనీసం స్వీకరించేందుకు కూడా ఇష్టపడలేదని సమాచారం.
ఇవి కూడా చదవండి
స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిన నివేదికలోని కొన్ని కీలకమైన అంశాలను కూడా సదరు ఐఏఎస్ అధికారి తొక్కిపెట్టారనే ప్రచారం సాగుతోంది. పేరుకు మాత్రమే చైర్మన్ పదవి ఇచ్చి, చేతులకు బేడీలు వేసి, నిర్ణయాధికారం లేకుండా చేయడం వల్లే మురళి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ఐఏఎస్ అధికారి అహానికి తోడు, ప్రభుత్వ పెద్దల ఉదాసీనత తోడైతే ఎలాంటి ఫలితం ఉంటుందో మురళి రాజీనామా ఉదంతం నిరూపించింది.
ఈ సంక్షోభ సమయంలో వ్యవస్థను సర్దుబాటు చేయాల్సిన ప్రభుత్వ సలహాదారు కేకే పాత్ర కూడా వివాదాస్పదంగా మారింది. తన నివేదికకు ఎదురవుతున్న అడ్డంకులను మురళి ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆయన కూడా సదరు ఐఏఎస్ అధికారికే వత్తాసు పలికినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వంలో తనకు లభించే మద్దతు శూన్యమని మురళి గ్రహించారు. సంస్కరణలు చేయాలనే తపన ఉన్నా, దాన్ని అడ్డుకునే అదృశ్య హస్తాలు బలంగా ఉన్నచోట ఉండటం వృధా అని ఆయన భావించినట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఈ ఆకస్మిక పరిణామంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో పడింది. పదవీకాలానికి ముందే ఒక కీలక అధికారి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? అనే అంశంపై వివిధ సోర్సుల ద్వారా సర్కార్ లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే విద్యా రంగంలో మార్పులు తీసుకువస్తామని ప్రగల్భాలు పలికిన సర్కార్, ఇప్పుడు ఒక సమర్థుడైన అధికారిని కోల్పోవడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందా? లేక ఈ వివాదాన్ని ఇక్కడితోనే తొక్కిపెడుతుందా? అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి







