అమీర్‌పేటలో ‘అన్న’ విగ్రహం.. రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్!
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు అసలైన వేదికగా మారింది. గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. ఇవాళ అక్కడ దివంగత ముఖ్యమంత్రి, నూతన శకానికి నాంది పలికిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగబోతోంది. అయితే, ఈ విగ్రహావిష్కరణ కేవలం ఒక నాయకుడి స్మరణ మాత్రమే కాదు, దీని వెనుక తెలంగాణ రాజకీయాల గమనాన్ని మార్చే వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై తెలంగాణ సమాజంలోని ఒక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. “తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకున్నది.. మళ్లీ ఆంధ్రా నాయకుల విగ్రహాలను ప్రతిష్టించడానికేనా?” అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాలను అవమానించడమేనంటూ కొందరు తెలంగాణవాదులు గళమెత్తుతున్నారు. కానీ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకే వెళ్తోంది. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన పొలిటికల్ రోడ్‌మ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యం.
ఇవి కూడా చదవండి
ఈ మొత్తం వ్యవహారం వెనుక 2023 అసెంబ్లీ ఎన్నికల నాటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. నాడు ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరంగా మారింది. టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లింది. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. భవిష్యత్తులోనూ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు, ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరుల మద్దతును తమ వైపే శాశ్వతంగా ఉంచుకోవాలనేది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఘోరంగా విఫలమైంది. నాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం కలగకపోవడంతో సీమాంధ్ర ఓటర్లంతా బీఆర్ఎస్ వైపు నిలిచారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ సమీకరణాలను పూర్తిగా మార్చేసి, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ విగ్రహావిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు. ఎంతమంది విమర్శించినా ఆయన వెనకడుగు వేయకపోవడానికి కారణం ఇదే.
మరోవైపు, ఈ విగ్రహావిష్కరణ అంశం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తే ఎక్కడ సీమాంధ్ర ఓటర్లు తమకు దూరం అవుతారోననే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో, నగరంలో కీలక పాత్ర పోషించే సీమాంధ్రుల ఓట్లను కోల్పోవడం బీఆర్ఎస్కు ఏమాత్రం ఇష్టం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందంటే దానికి సీమాంధ్ర ఓటర్ల సంపూర్ణ మద్దతే కారణం. అందుకే పార్టీ అగ్రనాయకత్వం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అయితే, పార్టీ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ.. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా విభాగాలు, కొందరు తెలంగాణవాదులు మాత్రం ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఏదేమైనా, అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహం కేవలం ఒక విగ్రహం కాదు.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు గుర్రాన్ని నిర్ణయించే ఒక పొలిటికల్ సెంటిమెంట్. విమర్శలను పక్కనపెట్టి సీమాంధ్రుల గుండెల్లో స్థానం సంపాదించాలనే కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు పారుతుందో, బీఆర్ఎస్ మౌనం ఆ పార్టీని ఎలా కాపాడుతుందో కాలమే నిర్ణయించాలి.







