బాల్క సుమన్ ఫ్రస్టేషన్..! ‘మిలిటెంట్’ వ్యాఖ్యలపై దుమారం!!
అధికారం కోల్పోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలో ఉనికిని చాటుకోవడం పెద్ద సవాలే. కానీ, ఆ ఉనికి కోసం ఏకంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి, హింసకు ప్రేరేపించేలా మాట్లాడితే అది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అవుతుంది. తాజాగా బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అనుబంధ విభాగం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) సమావేశంలో ఆయన చేసిన మిలిటెంట్ యాక్టివిటీ వ్యాఖ్యలు రాజకీయ బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ భవన్లో మంగళవారం జరిగిన సింగరేణి బొగ్గు గని కార్మికుల అంతర్గత సమావేశంలో బాల్క సుమన్ తీవ్ర ఉద్వేగభరితమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టులతో లాభం లేదని, అవసరమైతే హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను తగలబెట్టాలని, మందమర్రి డివిజన్లో జీఎం ఆఫీసును కాలబెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న రైల్వే లైన్లను ఒకరోజు కోసి పారేయాలని వ్యాఖ్యానించారు. సప్ప సప్పగా ఆందోళనలు చేస్తే కార్మికులు నమ్మరని, కేసులు పెడితే భయపడకుండా.. జైలుకు వెళ్తే గోల్డ్ మెడల్ వచ్చినట్లు ఫీల్ అవ్వాలని పిలుపునిచ్చారు. 45 రోజులు జైలుకు పోయి వస్తేనే కార్మికుల్లో నాయకత్వంపై నమ్మకం, ఓనర్షిప్ పెరుగుతుందని విశ్లేషించారు.
బాల్క సుమన్ ప్రసంగంలో పార్టీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన కరవైందనే ఆవేదన స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలోకి అడుగుపెట్టినా, తాము పిలుపునిస్తున్నా ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదని ఆయనే స్వయంగా అంగీకరించారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై భీమారంలో హైవే దిగ్బంధిస్తే కేవలం ఐదుగురు రైతులు మాత్రమే వచ్చారని, మిగతా 60–70 మంది బీఆర్ఎస్ కార్యకర్తలేనని చెప్పారు. అలాగే చెన్నూరు కిష్టంపేట వద్ద జాతీయ రహదారి రాస్తారోకోలోనూ నలుగురైదుగురు రైతులు తప్ప మిగతా వంద మంది పార్టీ వాళ్లేనని ఒప్పుకున్నారు. ప్రజలు ధైర్యంగా ముందుకు రావడం లేదని, వారిని ఆకర్షించడానికే ఇటువంటి మిలిటెంట్ యాక్టివిటీ అవసరమని ఆయన చెప్పారు.
బాల్క సుమన్ కేవలం సాధారణ నాయకుడు కాదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నేతగా ఎదిగి, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన ఒక బాధ్యతాయుతమైన నాయకుడు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని, రైల్వే లైన్లను ధ్వంసం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం తీవ్రమైన నేరంగా భావించాల్సి ఉంటుంది.
రాజకీయాల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేయడం, శాంతియుతంగా రాస్తారోకోలు, రైలు రోకోలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ, ‘మా కోసం లాఠీచార్జీలు తిన్నారు, జైలుకు వెళ్లారు’ అని కార్మికులు సింపతీ చూపించాలనే ఏకైక స్వార్థంతో ఆస్తుల ధ్వంసానికి పూనుకోవాలని చెప్పడం బీఆర్ఎస్ పార్టీకే పెద్ద తలనొప్పిగా మారింది.
కార్మిక వర్గాల్లో కోల్పోయిన పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి హింసను ఆశ్రయించాలనే సుమన్ ఆలోచనను సొంత పార్టీ నేతలే లోలోపల తప్పుబడుతున్నారు. ఇటువంటి ఉద్రిక్త వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల, కార్మికుల నమ్మకాన్ని గెలుచుకోవాల్సింది హృదయపూర్వక పోరాటాలతోనే కానీ, సింగరేణి భవనాలను తగలబెట్టడం ద్వారా కాదనే సత్యాన్ని నాయకులు గ్రహించాల్సి ఉంది.







