ఎయిర్టెల్ ‘5G ట్రిక్’తో టెలికాం ఇండస్ట్రీలో కుదిపేస్తున్న వివాదం
భారత టెలికాం రంగంలో సరికొత్త ‘5G’ వార్ మొదలైంది. టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్టెల్‘ (Airtel) తాజాగా తీసుకొచ్చిన ఒక వ్యూహం ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. తమ ప్రీమియం కస్టమర్ల కోసం ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ‘5G ప్రయారిటీ ప్లాన్’ పట్ల ప్రత్యర్థి సంస్థలైన రిలయన్స్ జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vi) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తక్షణమే జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వాలని ఆ రెండు సంస్థలు డిమాండ్ చేయడంతో.. ఏళ్ల నాటి ‘నెట్ న్యూట్రాలిటీ’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
ఏమిటీ ‘5G ప్రయారిటీ’ ప్లాన్?
ఎయిర్టెల్ (Airtel) తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ ప్రధాన ఉద్దేశం.. ఎక్కువ డబ్బులు చెల్లించే ప్రీమియం, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు నెట్‌వర్క్‌లో తొలి ప్రాధాన్యత ఇవ్వడం. అంటే నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో సాధారణ కస్టమర్ల కంటే ఈ ప్రయారిటీ ప్లాన్ తీసుకున్న వారికి ఎలాంటి అంతరాయం లేకుండా అత్యంత వేగవంతమైన 5G ఇంటర్నెట్ సేవలు అందుతాయి. ఒకరకంగా చెప్పాలంటే హైవే టోల్ గేట్ వద్ద సాధారణ వాహనాలు ఆగి ఉన్నా, వీఐపీ వాహనాలకు ఫ్రీ పాస్ ఇచ్చి పంపించినట్లు అన్నమాట.
జియో, వీఐ ఎందుకు భగ్గుమంటున్నాయి?
ఎయిర్టెల్ (Airtel) తీసుకున్న ఈ నిర్ణయంపై జియో, వీఐ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇంటర్నెట్ అనేది అందరికీ సమానంగా అందాలని, డబ్బున్న వారికి ఒకలాంటి స్పీడ్, సామాన్యులకు మరోలాంటి స్పీడ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నాయి. ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను ఇలా పక్షపాతంతో విభజించడం ముమ్మాటికీ ‘నెట్ న్యూట్రాలిటీ’ నియమాలను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి తరతమ భేదాలు టెలికాం మార్కెట్లో అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తాయని ట్రాయ్‌కు గట్టిగా ఫిర్యాదు చేశాయి.
నియంత్రణ సంస్థ (TRAI) స్పష్టత ఇస్తుందా?
ఈ హై-ప్రొఫైల్ వివాదం ఇప్పుడు ట్రాయ్ కోర్టుకు చేరింది. అయితే ఇక్కడ ఎయిర్టెల్ (Airtel) వాదన మరోలా ఉంది. తాము 5G మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, మెరుగైన సేవల కోసం ఎక్కువ చెల్లించే కస్టమర్లకు ఆ స్థాయిలో క్వాలిటీ సర్వీస్ (QoS) ఇవ్వడం తమ వ్యాపార వ్యూహంలో భాగమని ఎయిర్టెల్ సమర్థించుకుంటోంది. వాస్తవానికి, టెలికాం రంగంలో ఏళ్లుగా నెట్ న్యూట్రాలిటీపై ఒక నిర్దిష్టమైన విధానం అమల్లో ఉంది. ఇప్పుడు గనుక ఎయిర్టెల్ ప్లాన్‌కు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం, రాబోయే రోజుల్లో మిగతా ఆపరేటర్లు కూడా కచ్చితంగా ఇదే బాట పడతారు. మొత్తానికి, ఇంటర్నెట్ స్పీడ్‌ను అదనపు డబ్బుతో కొనే ఈ కొత్త విధానం సామాన్యుడి 5G అనుభవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందా? లేక టెలికాం కంపెనీల అప్పుల భారాన్ని తగ్గించే బ్రహ్మాస్త్రం అవుతుందా? అన్నది ట్రాయ్ తీసుకోబోయే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి







