ఏఐతో ఆ ఉద్యోగాలు ఖతం అనుకున్నా.. కానీ నా లెక్క తప్పింది: సామ్ ఆల్ట్‌మన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ. ఇది వచ్చిన కొత్తలో, ముఖ్యంగా చాట్‌జీపీటీ (ChatGPT) ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్, ఇతర వైట్-కాలర్ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఏఐ దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు గల్లంతవ్వడం ఖాయమని టెక్ దిగ్గజాలు సైతం హెచ్చరించాయి. స్వయంగా ఆ ఏఐని సృష్టించిన ఓపెన్ఏఐ (OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) కూడా అప్పట్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా తన అంచనాలు తప్పాయని అంగీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ భయంతో ఉన్న ఉద్యోగులకు కొండంత ఊరటనిచ్చారు.
లెక్క తప్పినందుకు సంతోషం..
ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ బ్యాంక్ నిర్వహించిన ఓ ప్రతిష్టాత్మక సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) సంచలన వ్యాఖ్యలు చేశారు. “2022లో మేము చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు, ఇది కచ్చితంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుందని, భారీ స్థాయిలో ఉద్యోగాలు (ముఖ్యంగా ఆఫీసుల్లో కూర్చుని చేసే వైట్-కాలర్ జాబ్స్) పోతాయని నేను ఆందోళన చెందా. కానీ అదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు నా అంచనాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆ విషయంలో నా లెక్కలు తప్పినందుకు, నేను పొరబడినందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
ఇవి కూడా చదవండి
మెదడుకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు!
యంత్రాలు ఎంత తెలివైనవైనా, మనిషి మెదడుకు అవి ప్రత్యామ్నాయం కాలేవని ఆల్ట్‌మన్ (Sam Altman) స్పష్టం చేశారు. ఏ పనిలోనైనా ‘హ్యూమన్ టచ్’ (మానవ ప్రమేయం) అనేది చాలా కీలకమన్నారు. ఏఐ రాకతో క్లిష్టమైన పనులు వేగవంతం అవ్వొచ్చు, సులువు అవ్వొచ్చు.. కానీ యంత్రాలు చేసే పనికి, మనుషులు తమ సహజ నైపుణ్యంతో ఆలోచించి చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుందని ఆయన విశ్లేషించారు. దయ, సానుభూతి, పరస్పర సహకారం, సంక్లిష్టమైన భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం వంటివి కేవలం మనుషులకే సాధ్యమని, వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికీ భర్తీ చేయలేదని తేల్చిచెప్పారు. మనుషుల స్థానాన్ని ఆక్రమించడం ఏఐకి అంత సులభమైన విషయం కాదని కుండబద్దలు కొట్టారు.
మారేది పని విధానమే..
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే (Jobs Apocalypse) ప్రమాదం ఏమాత్రం లేదని ఆల్ట్‌మన్ (Sam Altman) భరోసా ఇచ్చారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ, మన పని చేసే విధానంలో మార్పులు వస్తాయే తప్ప, మానవ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదన్నారు. మనుషులు తమ పనిని మరింత మెరుగ్గా, సులభంగా చేసుకునేందుకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ఊహించిన దానికంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మరింత సానుకూలంగా, విభిన్నంగా ఉంటాయని సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) చెప్పిన ఈ మాటలు.. కెరీర్ ముగిసిపోతుందేమో అని వణికిపోతున్న ఎంతో మందికి సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







