సీబీఎస్ఈ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఆన్లైన్ పేమెంట్ ఫెయిల్ అయితే ఇక నో టెన్షన్..!
పరీక్షలు రాసి, ఫలితాల కోసం టెన్షన్ పడటం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత ఏమైనా అనుమానాలు ఉండి రీవాల్యూయేషన్ పెట్టుకుందామంటే పేమెంట్ దగ్గర తలెత్తే సాంకేతిక సమస్యలతో విద్యార్థులు పడుతున్న నరకం అంతా ఇంతా కాదు. అకౌంట్లోంచి డబ్బులు కట్ అవుతాయి.. కానీ లావాదేవీ ఫెయిల్ అని చూపిస్తుంది. అటు డబ్బులు వెనక్కి రాక, ఇటు అప్లికేషన్ సబ్మిట్ కాక విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఈ తీవ్ర ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. సీబీఎస్ఈ (CBSE) పేమెంట్ గేట్‌వేను సమూలంగా ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయిన కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల బాస్‌లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
అసలు సమస్య ఎక్కడంటే..
ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తమకు వచ్చిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు జవాబు పత్రాల ఫోటోకాపీల కోసం లేదా రీవాల్యూయేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫీజులు చెల్లించేటప్పుడు సర్వర్ మొరాయించడం, సాంకేతిక లోపాలతో అకౌంట్లోంచి డబ్బులు కట్ అయినా పేమెంట్ ఫెయిల్ అవ్వడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
ఇవి కూడా చదవండి
రంగంలోకి విద్యాశాఖ మంత్రి
ఈ టెక్నికల్ సమస్యలకు శాశ్వత చెక్ పెట్టేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రంగంలోకి దిగారు. దేశంలోని నాలుగు అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ (CBSE) పేమెంట్ గేట్‌వే వ్యవస్థను విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అత్యంత వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా మార్చాలని ఆయన తేల్చిచెప్పారు.
ఆటోమేటిక్ రీఫండ్ సిస్టమ్ తప్పనిసరి!
ఈ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపై బ్యాంకర్లకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేశారు. ఒకవేళ పేమెంట్ గేట్‌వేలో సాంకేతిక లోపం తలెత్తి లావాదేవీ విఫలమైతే.. విద్యార్థుల అకౌంట్లోంచి కట్ అయిన డబ్బులు వాటంతట అవే వెంటనే తిరిగి జమయ్యేలా ‘ఆటోమేటిక్ రీఫండ్ సిస్టమ్’ (Automatic Refund System)ను పక్కాగా అమలు చేయాలి. అలాగే లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ‘రియల్ టైమ్ మానిటరింగ్’ (Real-time monitoring) వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాస్తవానికి మే 24న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ప్రత్యేక చర్చల తర్వాతే ఈ పేమెంట్ (CBSE) సిస్టమ్ ఆధునీకరణ ప్రక్రియ ఊపందుకుంది.
తాజాగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలతో బ్యాంకులు సైతం అప్రమత్తమయ్యాయి. సీబీఎస్ఈ బోర్డుతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ, అతి త్వరలోనే ఈ నూతన టెక్నికల్ అప్డేట్లను అమల్లోకి తెస్తామని ఆ నాలుగు బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఇకపై ఫీజు చెల్లింపుల విషయంలో సీబీఎస్ఈ విద్యార్థులకు పెద్ద టెన్షన్ తప్పినట్లే!
ఇవి కూడా చదవండి







