సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్.. 59 ఏళ్ల తర్వాత కేబినెట్లోకి కాంగ్రెస్..!
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (CM Vijay) రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్‌తోనే కాకుండా, పక్కా లెక్కలతో పొలిటికల్ చదరంగంలోనూ తానొక మాస్టర్ ప్లేయర్ అని నిరూపిస్తున్నారు. తాజాగా ఆయన చేపట్టిన భారీ మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం చెన్నైలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్.. 23 మంది కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో విజయ్ కేబినెట్ బలం 33కి చేరింది. ఈ మంత్రివర్గ కూర్పు వెనుక ఉన్న సామాజిక, రాజకీయ వ్యూహాలు చూసి సీనియర్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో కాంగ్రెస్!
ఈ కేబినెట్ విస్తరణలో అత్యంత ఆకర్షణీయమైన, చారిత్రాత్మకమైన అంశం.. కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గంలో చోటు దక్కడం. 1967లో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మళ్లీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగం కాలేదు. సరిగ్గా 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీఎం విజయ్ (CM Vijay) ఆ పార్టీకి అవకాశం కల్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్.రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలకు చెరో మంత్రి పదవిని కేటాయించారు. ఈ రెండు పార్టీలు త్వరలోనే ప్రభుత్వంలో చేరనుండటంతో కేబినెట్ సంఖ్య గరిష్ట పరిమితి అయిన 35కి చేరుకోనుంది.
ఇవి కూడా చదవండి
దళితులకు అగ్రతాంబూలం
టీవీకే (TVK) అధినేత విజయ్ (CM Vijay) తన మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఏకంగా ఏడుగురు దళిత నేతలకు కేబినెట్లో చోటు కల్పించి రికార్డు సృష్టించారు. అవినాశి నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ఎల్.మురుగన్‌పై సంచలన విజయం సాధించిన 27 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎస్.కమలికి మంత్రిగా ప్రమోషన్ దక్కింది. ఆమెతో పాటు దళిత సామాజిక వర్గానికి చెందిన డీ.లోకేష్ తమిళసెల్వన్ (అన్నాడీఎంకే సీనియర్ నేత పి.ధనపాల్ కుమారుడు), గాంధీరాజ్, తెన్నరసు, విశ్వనాథన్‌లకు అవకాశమిచ్చారు. వీసీకే పార్టీకి చెందిన వన్ని అరసు చేరికతో ఈ సంఖ్య ఎనిమిదికి చేరనుంది. విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలు రెండింటినీ దళిత మంత్రులకే (ఏ.రాజ్ మోహన్, విశ్వనాథన్) అప్పగించడం విశేషం. అలాగే దశాబ్దాల తర్వాత ఇద్దరు బ్రాహ్మణులకు (పి.వెంకటరమణన్, ఎస్.రమేష్) కూడా కేబినెట్లో అవకాశం కల్పించారు. రాజధాని చెన్నైలో 16కి గాను 14 సీట్లు సాధించిన నేపథ్యంలో చెన్నై ప్రాంతం నుంచి ఏకంగా ఏడుగురికి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ చేశారు.
అన్నాడీఎంకే రెబల్స్‌కు చెక్..
మంత్రివర్గాన్ని పూర్తిగా భర్తీ చేయడం ద్వారా విజయ్ (CM Vijay) రాజకీయంగా పెద్ద ఎత్తుగడ వేశారు. అన్నాడీఎంకే (AIADMK) నుంచి చీలిపోయి, ప్రభుత్వంలో చేరాలని ఉవ్విళ్లూరిన రెబల్ ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లారు. ఎస్.పి. వేలుమణి, సి. విజయభాస్కర్ లాంటి అవినీతి ఆరోపణలు ఉన్న నేతలను కేబినెట్లోకి తీసుకుంటే ద్రవిడ పార్టీల తరహాలోనే టీవీకే పార్టీకి ఉన్న “క్లీన్ ఇమేజ్, అవినీతి వ్యతిరేక” ముద్ర దెబ్బతింటుందని నాయకత్వం బలంగా విశ్వసించింది. పైగా బీజేపీ నేతలతో సాన్నిహిత్యం ఉన్న వేలుమణి లాంటి వారిని చేర్చుకుంటే, తన యాంటీ-బీజేపీ ఇమేజ్ దెబ్బతింటుందని విజయ్ భావించారు.
మరోవైపు, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి విప్ జారీ చేస్తే, రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో వారిని చేర్చుకుని ఎమ్మెల్యేల కొనుగోలు (హార్స్ ట్రేడింగ్) ఆరోపణలు ఎదుర్కోవడం ఇష్టం లేకే విజయ్ (CM Vijay) తన కేబినెట్ తలుపులు మూసేశారు. తనదైన వ్యూహాలతో, సమతుల్య సామాజిక సమీకరణాలతో తమిళ రాజకీయాల్లో విజయ్ వేస్తున్న అడుగులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడటమే కాకుండా, తన విధానాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో ఈ కేబినెట్ విస్తరణతో ఆయన దేశానికి చాటిచెప్పారు.
ఇవి కూడా చదవండి







