ఆ బ్యానర్ లో సూర్య మైల్ స్టోన్ మూవీ?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) కెరీర్లో కరుప్పు సినిమా భారీ మలుపు తీసుకొచ్చింది. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందించిందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కరుప్పు(Karuppu) సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సక్సెస్‌తో సూర్య మళ్లీ ఫుల్ జోష్‌లోకి వచ్చేసి వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కువ చర్చకు వస్తున్న విషయం సూర్య 50వ సినిమా.
తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చిందట. విజయ్(Vijay) నటిస్తున్న జన నాయగన్(Jana Nayagan) ను నిర్మిస్తున్న ఇదే సంస్థ ఇప్పుడు సూర్య 50వ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే సూర్యకు కథా చర్చలు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సరైన డైరెక్టర్ ను ఎంపిక చేసే పనిలో నిర్మాతలు బిజీగా ఉన్నారని, డైరెక్టర్ ఫైనల్ అయిన వెంటనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. సూర్య కెరీర్లో ఇది స్పెషల్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక సూర్య చేతిలో ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) తెరకెక్కిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్(Viswanath & Sons) షూటింగ్ ను ఆయన పూర్తి చేసినట్లు సమాచారం. మరోవైపు మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్(Jithu Madhavan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య47 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. అదేవిధంగా కరుప్పు సీక్వెల్‌పై కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని టాక్. పలు డైరెక్టర్లు చెప్పిన కొత్త కథలను కూడా సూర్య పరిశీలిస్తున్నట్లు సమాచారం. వరుస ప్రాజెక్టులతో సూర్య మళ్లీ పాన్ ఇండియా మార్కెట్‌పై బలమైన ఫోకస్ పెట్టినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి







