ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!
మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రం ‘బ్లాస్ట్ జోన్’ : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్లాస్ట్ జోన్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించడం విశేషం. మే 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, సోమవారం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మాట్లాడుతూ.. “అందరికీ హృదయకపూర్వక నమస్కారాలు. ఈ ‘బ్లాస్ట్ జోన్’ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. సినిమా పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి చెందే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమా ‘బ్లాస్ట్ జోన్’. మన తల్లిదండ్రులకో, మన వాళ్ళకో అన్యాయం జరిగితే న్యాయం కోసం మనం ఖచ్చితంగా పోరాడతాం. అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా చెబుతుంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి? వంటి అద్భుతమైన అంశాలు ఇందులో ఉంటాయి. నేను ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేశాను. కానీ, ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ నాకంటే బాగా ఫైట్లు చేశారు. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ‘బ్లాస్ట్ జోన్’ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
రవి బస్రూర్ గారు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. నేపథ్య సంగీతం కోసం ఏకంగా 40-45 రోజులు కేటాయించారు. సాంకేతికంగా ప్రతి విభాగం అద్భుతంగా పని చేసింది. విజువల్స్ బాగుంటాయి. ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా మా సుభాష్ కె రాజ్ వయసులో చాలా చిన్నవాడు కానీ, గొప్పగా సినిమాను తెరకెక్కించాడు. ఇది విభిన్నమైన చిత్రం. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ మా సినిమాను నిర్మించడం గర్వంగా ఉంది. అలాగే తెలుగులో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నాగవంశీ గారు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాను విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. ఇది మీకు డబ్బింగ్ సినిమాలా అనిపించదు. ప్రతి పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది. ఇది మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రం ‘బ్లాస్ట్ జోన్’. ఈ సినిమాను మీరందరూ మే 28న థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.
ఇవి కూడా చదవండి
నటి అభిరామి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘బ్లాస్ట్ జోన్’ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మాస్ మూవీతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మాస్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు. ఒక చిన్న ఫైట్ కూడా చేయలేదు. సాధు మనిషిని నేను. అలాంటి నన్ను ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించారు మా దర్శకుడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. గాయం కూడా అయింది. మీకు వినోదం అందించడం కోసం ఏమైనా చేయొచ్చు. టీమ్ అందరం ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాము. ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను. ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదొక మాస్ మసాలా ఫిల్మ్. విజువల్స్, మ్యూజిక్, స్టంట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూసి అనుభూతి చెందాల్సిన సినిమా. మే 28న థియేటర్లలో ‘బ్లాస్ట్ జోన్’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.
నటి ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ మే 28న థియేటర్లలో విడుదలవుతోంది. మీ అందరూ థియేటర్లో సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తెలుగు ట్రైలర్ పై ప్రేక్షకుల ఎంతో ప్రేమ కురిపించారు. ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగులో మా సినిమాను విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ కు ధన్యవాదాలు.” అన్నారు.
దర్శకుడు సుభాష్ కె రాజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా నన్ను, నా కథను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన నిర్మాత అఘోరం గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో మీరు వింటేజ్ అర్జున్ గారిని చూస్తారు. తమిళ్ లాగానే తెలుగులో కూడా అర్జున్ గారికి ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సినిమా అర్జున్ గారి అభిమానులకు ఒక ట్రీట్ లా ఉంటుంది. ప్రీతి ముకుందన్ గారు, అభిరామి గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాను నమ్మి, తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ‘బ్లాస్ట్ జోన్’ ట్రైలర్ కింద నేను కామెంట్స్ చూశాను. మీ అందరికీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని అర్థమైంది. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ‘బ్లాస్ట్ జోన్’ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని ప్రతి పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది.” అన్నారు.
అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య కల్పాత్తి మాట్లాడుతూ.. “తెలుగులో మా చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. భవిష్యత్ లో సితార భాగస్వామ్యంతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా సినిమాకు మీడియా నుంచి లభిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ మా సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.
ఇవి కూడా చదవండి







