పెద్ది సిక్స్ కొట్టినట్టు ఎవరూ కొట్టలేరు!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్దిపై ప్రేక్షకుల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సానా(buchibabu sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు(Venkata satish Kilaru) నిర్మిస్తుండగా, 2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ ఫోటోలు, పోస్టర్లు సినిమాపై విపరీతమైన హైప్ తీసుకువచ్చాయి. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రామ్ చరణ్ వ్యక్తిత్వం, సెట్స్‌లో ఆయన ప్రవర్తన గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు భాషపై మొదట్లో కొంత టెన్షన్‌గా ఫీల్ అయ్యానని జాన్వీ కపూర్ ఈ సందర్భంగా వెల్లడించింది. అయితే రామ్ చరణ్ తనను ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారని, సెట్స్‌లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించారని తెలిపింది. ఆయన నడవడి, సహనం గౌతమ బుద్ధుడిని గుర్తు చేస్తాయని చెప్పిన జాన్వీ, చరణ్ వల్లే తాను ఈ పాత్రలో మరింతగా ఒదిగిపోయానని పేర్కొంది. ఒక నటిగా తనలో కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చిన సినిమా ఇదేనని ఆమె చెప్పడం విశేషం. దీంతో సినిమాలో జాన్వీ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక సరదాగా మాట్లాడిన జాన్వీ, సిక్స్ కొట్టేటప్పుడు పెద్ది యాటిట్యూడ్‌కు ఎవరూ సాటి రారంటూ రామ్ చరణ్ క్యారెక్టర్ ను తన ఫేవరెట్ క్రికెటర్‌గా అభివర్ణించింది. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సానా విజన్, ఏఆర్ రెహమాన్(A. R. Rahman) అందిస్తున్న సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. భావోద్వేగాలు, యాక్షన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కలిసిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







