ఎబోలా వైరస్ హెచ్చరిక.. హైఅలర్ట్‌లో గాంధీ ఆసుపత్రి
మధ్య ఆఫ్రికా దేశాలలో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు నివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కానప్పటికీ, ముందు జాగ్రత్తగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయా దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎబోలా అనుమానితులకు తక్షణ వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి , జనరల్ మెడిసిన్ డాక్టర్ సునీల్ కుమార్‌ను నోడల్ అధికారిగా నియమించారు. ప్రస్తుతం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)తో పాటు అంగోలా, కెమరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో రిపబ్లిక్ వంటి దేశాలలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
వ్యాధి లక్షణాలు ..
సాధారణంగా ఎబోలా వైరస్ గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. కరోనాతో పోలిస్తే ఇందులో మరణాల రేటు చాలా ఎక్కువ. వైరస్ సోకిన 2 నుండి 21 రోజుల్లో కింద పేర్కొన్న లక్షణాలు బయటపడతాయి.
ఇవి కూడా చదవండి
మొదటి దశ..
డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తరహాలోనే 101 డిగ్రీల ఫారెన్‌హీట్ జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు-కండరాల నొప్పులు, గొంతు నొప్పి, తీవ్ర నీరసం , మింగడానికి కష్టంగా ఉండటం వంటివి జరుగుతాయి.
రెండూ దశ..
విరేచనాలలో రక్తం పడటం, కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు రావడం, కళ్లు ఎర్రగా మారటం వంటివి కనిపిస్తాయి.
చివరి దశ..
పరిస్థితి విషమించి నోరు, ముక్కు, చిగుళ్లు, మలం, మూత్రం ద్వారా రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) జరగడం, కిడ్నీలు, లివర్ దెబ్బతిని రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
నిపుణుల సూచనలు.. ఆందోళన వద్దు!
గడిచిన 3 వారాల్లో (21 రోజులు) ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన ట్రావెల్ హిస్టరీ ఉన్నా, లేదా అక్కడ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నా.. వెంటనే ఐసోలేషన్‌లో ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వారు సొంత వైద్యంతో పారాసిటమాల్, పెయిన్ కిల్లర్ బిళ్లలు వాడకూడదని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎబోలా అనేది కరోనా లాగా గాలి ద్వారా వ్యాపించదు. కాబట్టి ప్రజలు అనవసరంగా భయపడాల్సిన పనిలేదు. కేవలం బాధితుల రక్తం, వాంతులు, మలం, మూత్రం, చెమట, కన్నీళ్లు, లాలాజలం, వీర్యం వంటి ద్రవాల ద్వారా మాత్రమే ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. మన దేశంలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేనందున ఆందోళన చెందకుండా కేవలం అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని ఆయన సూచించారు.







