నాలుగేళ్ల యుద్ధం తర్వాత రష్యా పరిస్థితి ఏంటి?.. బయటపడుతున్న సంచలన నిజాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత భీకరంగా కొనసాగుతోంది. ఇరుదేశాలు పట్టుదలకు పోవడంతో.. ముగింపు ఎప్పుడో తెలియడం లేదు. కొన్నేళ్లపాటు అమెరికా మధ్యవర్తిత్వం చేసినా.. అది పెద్దగా ఫలితాన్నిచ్చిన దాఖలా లేదు.ముఖ్యంగా ఉక్రెయిన్ లో పలు ప్రాంతాలను తమకు దారాదత్తం చేయాలని రష్యా డిమాండ్ చేస్తుండడంతో… ఉక్రెయిన్ యుద్ధం కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రాణనష్టం విపరీతంగా పెరిగిపోతోంది.
అయితే రష్యా ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి జరుగుతోన్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనిక పరంగా భారీ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోంది. ఈ పోరులో 5 లక్షల మంది మాస్కో సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ నిఘా వర్గాలు అంచనావేశాయి.
ఇవి కూడా చదవండి
మరోవైపు, యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి తాము 55వేలమంది సైనికులను కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఫిబ్రవరిలో వెల్లడించారు. ఇరువైపులా ప్రాణనష్టం భారీగానే ఉన్నా.. రెండు దేశాలు వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదనే ఆరోపణలున్నాయి. గత నాలుగేళ్లుగా డాన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశలవారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్నవారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం.. యుద్ధరంగంలో భారీగా ప్రాణనష్టానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు, అమెరికా, దాని మిత్రదేశాలు సరఫరా చేసే క్షిపణి వ్యవస్థలు, ఫిరంగి, అధునాతన డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. కమాండ్ పోస్టులు, సైనిక సమూహాలు లక్ష్యంగా జెలెన్స్కీ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో ఈ నష్టం మరింత పెరిగిందనే అంచనాలున్నాయి. ఈ దాడులను ఎదుర్కొనేలా రష్యా (Russia) సుశిక్షితులైన సైనికులను నియమించుకోలేకపోతుందని, విధుల్లో ఉన్నవారిని కాపాడుకునేలా ఎలాంటి రక్షణకవచాలను సమీకరించలేకపోతుందని యూకే నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కారణాలే రష్యాను దెబ్బతీస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆర్మీలో యువతను చేర్చుకునేందుకు రష్యా (Russia) ప్రభుత్వం వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా రక్షణశాఖతో ఒప్పందం కుదుర్చుకునే వారికి, వారి కుటుంబాలకు ఉండే రుణాల్లో 10 మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.1.33కోట్లు) వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కొత్తగా సైన్యంలో చేరాలనుకునే వారు కనీసం ఏడాది పాటు కొనసాగుతానని హామీ ఇవ్వాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించిన నిర్ణయంపై అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) సంతకం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి







