విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జేఎన్టీయూలో అవగాహన సదస్సు తేదీ ఖరారు
JNTU: ఇంజినీరింగ్ అనగానే కేవలం కంప్యూటర్ సైన్స్ (CSE) మాత్రమే అనే ధోరణి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. కోర్సు పూర్తి కాకముందే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో అందరూ సీఎస్ఈ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంజినీరింగ్ అంటే ఒక్క కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదని, ఇతర కోర్ కోర్సుల్లోనూ అద్భుతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET) ర్యాంకర్లు, వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి జూన్ రెండో వారంలో జేఎన్టీయూ (JNTU) వేదికగా ఒక ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించనుంది.
కోర్ కోర్సులతోనే స్థిరమైన భవిష్యత్తు
సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వంటి ప్రధాన కోర్సులు పూర్తి చేసిన వెంటనే మెరుగైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వీటితో పాటు కెమికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, బయో ఇంజినీరింగ్, ట్రాన్స్ఫార్మర్ మేనేజ్మెంట్ , విండ్ ఎనర్జీ వంటి అనుబంధ రంగాలలో కూడా విస్తృతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భయాలు ..
కృత్రిమ మేధ (Artificial Intelligence) రాకతో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకవేమోననే ఆందోళన ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ఈ సదస్సులో భవిష్యత్తులో రాబోయే మార్పులను నిపుణులు ఉదాహరణలతో వివరించనున్నారు. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది కేవలం భ్రమ మాత్రమేనని, దీనిపై ఉన్న అపోహలను తొలగించనున్నారు.
పరిశోధనలు, స్టార్టప్‌లపై ప్రోత్సాహం..
చదువుకునే రోజుల్లోనే సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలపై ఆసక్తి చూపే విద్యార్థులను ప్రోత్సహించేందుకు జేఎన్టీయూ క్యాంపస్‌తో పాటు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో అంకుర సంస్థలను (Startups) ప్రారంభించడానికి తగిన వేదికలు ఉన్నాయని వివరించనున్నారు.
160 కళాశాలలు.. లక్షకు పైగా సీట్లు..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉండగా, దాదాపు 1.10 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు వెళ్లే ముందే.. వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో చేరాలి? ఇంటికి దగ్గరగా ఉండేలా ఎలా ఎంచుకోవాలి? అనే విషయాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిపుణులు దిశా నిర్దేశం చేయనున్నారు.
ప్రధాన కోర్సులతోనే ఉపాధి..
“సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి సాంప్రదాయ కోర్సులు ఎప్పుడూ నిత్యనూతనమైనవి. వీటికి నిరంతరం ఉపాధి అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, బహుళజాతి సంస్థలు, పరిశ్రమలు రానున్నాయి. కేవలం కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయనుకోవడం పెద్ద అపోహ. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న ఇలాంటి అపోహలను తొలగించడానికే త్వరలోనే ఈ ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నారు.”







