ట్రంప్ సంచలన ప్లాన్.. తెరపైకి ‘అబ్రహం అకార్డ్’ మళ్లీ!
అమెరికా అధ్యక్షుడు మరోసారి అబ్రహం అకార్డ్ .. తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా ఇరాన్ తో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో.. ఈ ఒప్పందాలను ప్రస్తావించారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్ వంటి దేశాలు వాటిపై సంతకం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు కాస్తా క్రమంగా డిమాండ్ రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఏమిటీ ఒప్పందాలు..? వాటిని విస్తరించాలని ట్రంప్ ఎందుకు కోరుకుంటున్నారు? ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి వాటిని ఎందుకు ముడిపెడుతున్నారు?
అబ్రహం అకార్డ్ అంటే..
ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడమే లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాలను అబ్రహం అకార్డ్ అంటారు. ముఖ్యంగా యూదు, ఇస్లాం, క్రైస్తవ మతాల్లో అబ్రహామిక్ మూలాలను దృష్టిలో పెట్టుకొని వీటికి ఈ పేరు పెట్టారు.
ఇవి కూడా చదవండి
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తొలి దఫా పాలన సాగించినప్పుడు.. 2020లో యూఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కజఖ్‌స్థాన్ నిరుడు నవంబరులో వీటిలో లాంఛనంగా చేరింది. సౌదీని ఈ ఒప్పందాల్లో చేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిగినా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా సాకారం కాలేదు.
ఎందుకు కీలకం?
పశ్చిమాసియాలో శాంతికి అబ్రహాం ఒప్పందాలు కీలకం. ఈ ఒప్పందాల కారణంగా… ఇజ్రాయెల్-అరబ్ దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. ఇజ్రాయెల్-మొరాకో, ఇజ్రాయెల్-బహ్రెయిన్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. టెల్అవీవ్తో ఆర్థిక, భద్రతా సంబంధాలను యూఏఈ బలోపేతం చేసుకుంది. అయితే ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణకు పరిష్కారం చూపకపోవడంతో.. పలు ముస్లిం మెజార్టీ దేశాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి.
ట్రంప్ పిలుపు పాకిస్థాన్‌కు ఎంతమాత్రమూ నచ్చదనే చెప్పాలి. అది ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించలేదు. అబ్రహాం ఒప్పందాల్లో చేరాలని 2020లోనే పాక్‌ను అమెరికా సంప్రదించింది. అప్పటి ఇమ్రాన్‌ఖాన్ సర్కారు అందుకు అంగీకరించలేదు. తర్వాత వచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్‌ను గుర్తించేందుకు ససేమిరా అంది. ఈ ఒప్పందాల్లో చేరితే షరీఫ్ సర్కారు స్వదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పుంది. అబ్రహాం ఒప్పందాల్లో చేరడం తనకు ఇష్టం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







