Iran-US War: సౌదీకి చెయ్యిచ్చిన పాకిస్తాన్..?
కష్టకాలంలోనే మిత్రుడి అవసరం తెలిసివస్తుందంటారు. ఎందుకంటే ఆసమయంలో నీవు సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయంలో చేయిస్తే.. వారిని నమ్మక ద్రోహులు అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ను… సౌదీ అలానే చూస్తోంది. ఎందుకంటే.. ఇటీవల ఇరాన్.. సౌదీపై దాడులు చేస్తోంది.ఈ దాడుల సమయంలో, సౌదీ అరేబియాకు రక్షణ పరంగా మద్దతివ్వాల్సిన పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్ తో ఉద్రిక్తతలను సాకుగా చూపి తెలివిగా తప్పుకుంది. దీంతో పాక్ తీరుపై సౌదీ కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో రాజుకుంటున్న సంక్షోభం, సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక సైనిక రక్షణ ఒప్పందం (ఎస్ఎండీఏ) బలాన్ని, విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు అత్యంత దృఢమైనదిగా ప్రచారం పొందిన ఈ బంధంలో తాజా పరిణామాలు తీవ్రమైన బీటలను బహిర్గతం చేశాయి. ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ చుట్టూ అల్లుకున్న ఈ వ్యవహారం, ఇస్లామాబాద్ విశ్వసనీయతపై అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.
ఈ ఒప్పందం కుదిరినప్పుడు ఇరు దేశాలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి. బయటి శక్తుల నుంచి ముప్పు వాటిల్లితే ఒకరికొకరు అండగా నిలవాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఒకరిపై దాడి జరిగితే, అది ఇద్దరిపై జరిగినట్టుగా భావించి సంయుక్తంగా ప్రతిస్పందించే ‘నాటో’ తరహా కూటమిగా విశ్లేషకులు దీనిని అభివర్ణించారు. సంపన్న గల్ఫ్ దేశానికి, దక్షిణాసియా భాగస్వామి అయిన పాకిస్థాన్ భద్రతాపరంగా అండగా నిలుస్తుందనే భరోసా ఈ ఒప్పందం కల్పించింది.
అయితే, 2026 ఫిబ్రవరి 28న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరాన్‌లోని సైనిక, రాజకీయ మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ సమన్వయంతో దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఒప్పందం ప్రకారం, ఈ క్లిష్ట సమయంలో పాకిస్థాన్ సైనికపరంగా సౌదీకి మద్దతుగా నిలవాలి. కానీ, పాకిస్థాన్ నుంచి ఎలాంటి సైనిక సహాయం అందలేదు. దీంతో నమ్మకమైన భాగస్వామిగా పాక్ పాత్రపై సందేహాలు మొదలయ్యాయి.
సంవత్సరాలుగా సౌదీ భద్రతకు తాము ఒక వ్యూహాత్మక అండగా ఉంటామని చెబుతూ వచ్చిన పాకిస్థాన్, తీరా అవసరం వచ్చినప్పుడు మాట తప్పడం గమనార్హం. ఇది సౌదీ అరేబియాకు తీవ్ర నిరాశ కలిగించే అంశం. ఈ ఒప్పందంపై సౌదీ దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో పెట్టుబడి పెట్టింది. ప్రాంతీయ ముప్పులను ఎదుర్కోవడంలో పాక్ విశ్వసనీయతకు ఇదే నిదర్శనమని సౌదీ అధికారులు పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ప్రస్తుత సంక్షోభం, పాక్ మద్దతు కేవలం మాటలకే పరిమితమని, చేతల్లో శూన్యమని తేల్చి చెప్పింది.
పాకిస్థాన్ వైఖరి వల్ల సౌదీ తన రక్షణ భాగస్వామ్యాలపై పునరాలోచనలో పడింది. పాక్ నుంచి ఏర్పడిన లోటును భర్తీ చేసుకునేందుకు పశ్చిమ దేశాలతో సహా ఇతర భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు, ఈ పరిణామం పాకిస్థాన్ దౌత్య పరపతిని కూడా దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో ఏదైనా సంక్షోభం వస్తే పాకిస్థాన్‌ను నమ్మవచ్చా లేదా అని ఇతర దేశాలు ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది.







