ఈ రూట్లో ఒకే ఒక్క ఎంఎంటీఎస్.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
MMTS: ఘటకేసర్ నుండి భరత్‌నగర్ మార్గంలో ప్రయాణించే ఎంఎంటీఎస్ (MMTS) ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రూట్లో కేవలం ఒకే ఒక సర్వీసు నడుపుతుండటంతో ఐటీ ఉద్యోగులు, రోజువారీ కూలీలు , విద్యార్థులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. కార్యాలయాల వేళలకు, రైలు నడిచే సమయాలకు అస్సలు పొంతన లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5, సాయంత్రం 5 చొప్పున ఈ మార్గంలో రోజుకు కనీసం 10 సర్వీసులను నడపాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఘటకేసర్ – రామచంద్రాపురం సర్వీసును భరత్‌నగర్ స్టేషన్ వరకే పరిమితం చేస్తూ, ట్రిప్పుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
షెడ్యూల్ వివరాలు..
ఉదయం 7.30 గంటలకు ఘటకేసర్ నుండి బయలుదేరే ఈ ఎంఎంటీఎస్ రైలు.. చర్లపల్లి, నేరేడ్మెట్, అమ్ముగూడ, భూదేవినగర్, సుచిత్ర సెంటర్, ఫిరోజ్‌గూడ, సనత్‌నగర్, భరత్‌నగర్, బోరబండ, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, చందానగర్ మీదుగా ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఇక్కడి నుండి ఆర్సిపురం వెళ్ళిన అనంతరం, తిరిగి ఆర్సిపురం నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ఘటకేసర్‌కు వెళ్తుంది. ఇక్కడి నుండి తిరిగి సనత్‌నగర్ వరకు నడిచే ఈ రైలు.. అటు నుంచి మళ్లీ రాత్రి 10 గంటలకు ఘటకేసర్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత తెల్లాపూర్ నుండి రిటర్న్ సర్వీసు ప్రారంభం అవుతుండటం వల్ల ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడటం లేదు. అందువల్ల ఈ సర్వీసును ఉదయం 6.20 గంటలకే తెల్లాపూర్ నుండి ప్రారంభించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భరత్‌నగర్‌కు సర్వీసులు పెంచితే మేలు..
ప్రస్తుతం నడుస్తున్న సర్వీసును భరత్‌నగర్ వరకే నడుపుతూ ట్రిప్పుల సంఖ్యను పెంచడం ద్వారా పశ్చిమ ప్రాంతాల వారికి చర్లపల్లి చేరుకోవడం ఎంతో సులువవుతుందని ఎంఎంటీఎస్ ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. భరత్‌నగర్ నుండి లింగంపల్లి వైపు వెళ్లేవారు నాంపల్లి, ఫలక్‌నుమా రూట్ల నుండి వచ్చే ఇతర సర్వీసులను ఉపయోగించుకోవచ్చని, దీనివల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు.







