హైదరాబాద్‌కు సరికొత్త గేమింగ్ క్రేజ్.. దేశంలోనే తొలి ‘క్లా కల్చర్’ ఎంటర్టైన్మెంట్ హబ్ ప్రారంభం!
Hyderabad: భాగ్యనగర యువతకు సరికొత్త అంతర్జాతీయ స్థాయి వినోదాన్ని పరిచయం చేస్తూ, భారతదేశంలోనే మొట్టమొదటి వినూత్న ‘క్లా ఎక్స్పీరియన్స్’ కేంద్రం ‘క్లా కల్చర్’ (Claw Culture) తన కార్యకలాపాలను ప్రారంభించింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో సుమారు 3,500 చదరపు అడుగుల విశాలమైన స్థలంలో ఈ అత్యాధునిక గేమ్ జోన్‌ను నిర్మించారు. దేశీయ అవుట్-ఆఫ్-హోమ్ వినోద రంగంలోనే ఈ ప్రాజెక్ట్ ఒక సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది.
సోషల్ మీడియా లవర్స్ కోసమే ప్రత్యేక డిజైన్..
ఈ సరికొత్త గేమింగ్ హబ్‌ను ప్రధానంగా నేటి తరం (Gen Z), మిలీనియల్స్, కపుల్స్ , పాప్-కల్చర్ లవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడి ప్రతి మూలను సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకునేలా, ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ , ఫొటోలకు పర్ఫెక్ట్గా సరిపోయేలా (Social-First Design) రిచ్ లైటింగ్‌తో డిజైన్ చేశారు. సాధారణ గేమింగ్ ఆర్కేడ్ల వలే కాకుండా, ఇది వంద శాతం క్లా మెషీన్ల కాన్సెప్ట్‌తోనే నడుస్తుంది.
ప్రధాన ఆకర్షణలు ఇవే..
విభిన్న సవాళ్లతో కూడిన డెబ్బైకి పైగా అత్యాధునిక క్లా మెషీన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రత్యేక ప్రైజ్ వాల్లో క్రేజీ గాడ్జెట్లు, లగ్జరీ వస్తువులు, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ప్రదర్శించారు. వీటిని ప్రతి వారం మారుస్తూ ఉంటారు. ఇక్కడ కాయిన్స్ లేదా చిల్లర డబ్బుతో పనిలేదు. అంతా డిజిటల్ గేమ్కార్డ్ విధానం ద్వారానే నడుస్తుంది. గేమ్స్ ఆడటం, రీఛార్జ్ , గెలిచిన గిఫ్ట్‌లను మార్చుకోవడం వంటివన్నీ ఒకే ఖాతా ద్వారా జరుగుతాయి.చిన్న గిఫ్ట్‌లను రీడీమ్ చేసుకోవడం ద్వారా ఎంతో ఆకర్షణీయమైన పెద్ద పెద్ద ట్రోఫీలను సొంతం చేసుకునే వీలు కలెక్టర్లకు కల్పించారు. బర్త్‌డే పార్టీలు, కాలేజ్ గ్రూప్స్ , కార్పొరేట్ ఈవెంట్ల కోసం ప్రత్యేక హోస్ట్‌లతో కూడిన కస్టమైజ్డ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అందుకే హైదరాబాద్‌ను ఎంచుకున్నాం..
దేశంలో వినోద రంగం ఒక కొత్త మార్పును ఆశిస్తోందని క్లా కల్చర్ సీఈఓ సిల్వియో లీడ్కే తెలిపారు. ప్రజలు కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా, తాము స్వయంగా భాగస్వామ్యులవుతూ ఆనందించే సరికొత్త అనుభూతిని కోరుకుంటున్నారని చెప్పారు. టోక్యో, దుబాయ్, సియోల్ నగరాల తరహాలోనే ఇలాంటి సరికొత్త బ్రాండ్లను ఆదరించే ఎనర్జీ, సాంస్కృతిక స్వేచ్ఛ హైదరాబాద్ యువతలో పుష్కలంగా ఉన్నాయని, అందుకే తమ మొదటి ఫ్లాగ్షిప్ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించినట్లు ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఏడాది కాలంలో ఈ సరికొత్త వినోద అనుభవాన్ని దేశంలోని ఇతర మెట్రో నగరాలకు కూడా విస్తరించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.







