కాచిగూడ రైల్వే స్టేషన్‌కు సోలార్ భరోసా.. ఏడాదికి రూ.25 లక్షల ప్రజాధనం ఆదా
Solar Power: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పర్యావరణహితంగా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న సోలార్ పవర్‌ను స్టేషన్ పరిధిలోని వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ సరఫరా చేసే సాధారణ విద్యుత్‌తో పోలిస్తే సోలార్ విద్యుత్ యూనిట్ ధర సగానికి సగం తక్కువగా ఉండటంతో.. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ ఎలక్ట్రికల్ విభాగానికి సంవత్సరానికి లక్షల రూపాయల ప్రజాధనం ఆదా అవుతోంది. ఈ విభాగం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) జాతీయ ఇంధన పొదుపు అవార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం.
2018 లో ఒప్పందం ..
దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ స్టేషన్లో విద్యుత్ కొనుగోలు కోసం 2018లో ఢిల్లీకి చెందిన ‘రెన్యూ పవర్స్ సిస్టమ్స్’ సంస్థతో 25 ఏళ్ల పాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (PPA) చేసుకుంది. ఇందులో భాగంగా యూనిట్‌కు రూ.5 చొప్పున సౌర విద్యుత్‌ను సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. స్టేషన్ ప్లాట్‌ఫారాల భవనాలపై 200 కేడబ్ల్యూపీ సామర్థ్యంతో రెండు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వీటిపై సోలార్ ప్యానెళ్లను అమర్చారు. మొత్తం సోలార్ యూనిట్ల సామర్థ్యం 400 కేడబ్ల్యూపీగా ఉంది.
గణనీయంగా పెరిగిన విద్యుత్ ఉత్పత్తి..
స్టేషన్ అవసరాల కోసం లోపల 1200 బీఎల్డీసీ ఫ్యాన్లు, 3 వేల ఎల్ఈడీ విద్యుత్ బల్బులను వాడుతున్నారు. వీటి కోసం, శీతాకాలంలో రోజుకు సగటున 1300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుత వేసవి కాలంలో ఎండల వల్ల ఈ ఉత్పత్తి రోజుకు 1700 యూనిట్లకు పెరిగింది.
ఏడాదికి రూ. 25 లక్షల ఆదా..
గత ఏప్రిల్ నెలలో ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా 43 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, కాచిగూడ స్టేషన్ అవసరాలకు 49 వేల యూనిట్లను వినియోగించారు. సోలార్ పవర్ పోను మిగిలిన 7 వేల యూనిట్లను మాత్రమే ఎస్పీడీసీఎల్ నుండి యూనిట్‌కు రూ.10 చొప్పున కొనుగోలు చేశారు. సాధారణ విద్యుత్ రేటుతో పోలిస్తే సగం ధరకే (రూ.5) సోలార్ పవర్ లభించడంతో ఒక్క ఏప్రిల్ నెలలోనే రైల్వేకు రూ.2.12 లక్షలు మిగిలాయి. ఈ లెక్కన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్‌కు సౌర విద్యుత్ వినియోగం వల్ల ఏడాదికి సుమారు రూ.25 లక్షల వరకు ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.







