పూజా, మృణాల్ ఆశలన్నీ జూన్ 5పైనే!
బాలీవుడ్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ హై జవానీ తో ఇష్క్ హోనా హై(Hai Jawani Toh Ishq Hona Hai) ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja hegde), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్లుగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలతో దగ్గరైన ఈ ఇద్దరు భామలు, హిందీలో మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోతున్నారు. వరుసగా సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ మాత్రం అందని ద్రాక్షగానే మారింది.
ఇలాంటి సమయంలో ఈ సినిమా ఇద్దరికీ కీలకంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ గ్లామర్ హైలైట్‌గా నిలవడంతో పాటు, వారి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై మరింత బజ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వరుణ్ ధావన్‌తో వారి కెమిస్ట్రీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేస్తోందని సమాచారం.
వరుణ్ ధావన్ తండ్రి, బాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ డేవిడ్ ధావన్(David Dhawan) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను టిప్స్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ఫలితం పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ కెరీర్లకు కీలక మలుపు తిప్పే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హిందీలో మళ్లీ స్టార్ హీరోయిన్ల రేసులో నిలవాలంటే ఈ సినిమా విజయమే కీలకమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.







