చరణ్ మాట నిలబెట్టుకోవాలంటే పెద్ది చాలానే చేయాలి
రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్ది(Peddi) సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఇటీవల పలుచోట్ల మాట్లాడిన చరణ్, ఈ సినిమాను తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్‌గా అభివర్ణించడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒక హీరో తన సినిమా రిలీజ్‌కు ముందే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అరుదు. ముఖ్యంగా ఇప్పటికే మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్‌లు ఉన్న హీరో ఇలా చెప్పడం వల్ల అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పెద్ది నిజంగా ఆ స్థాయిని అందుకుంటుందా అనే దానిపైనే ఉంది.
మగధీర(Magadheera), రంగస్థలం(Rangasthalam), ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలు చరణ్ యాక్టింగ్ లో ప్రత్యేక మైలురాళ్లుగా నిలిచాయి. రంగస్థలంలో గ్రామీణ యువకుడిగా ఆయన చూపించిన నటన ఇప్పటికీ అభిమానులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉంది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్(NTR) తో ఈక్వల్ గా నిలిచిన తీరు ఆయనకు నటుడిగా కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు పెద్ది ఈ సినిమాల కంటే ముందుకు వెళ్లాలంటే కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, భావోద్వేగాలు, కథనం, పాత్ర రూపకల్పనలోనూ కొత్త అనుభూతి ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇక డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana)పై కూడా భారీ బాధ్యత పడింది. స్పోర్ట్స్ డ్రామాల జానర్లో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలు రావడంతో పోలికలు సహజమే. అలాంటి సమయంలో పూర్తిగా కొత్త ట్రీట్మెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం సవాల్‌గా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా నిలబడాలంటే భావోద్వేగం, విజువల్ గ్రాండియర్, బలమైన కథ.. ఈ మూడూ సమతూకంగా ఉండాలి. ఈ అంచనాలను పెద్ది అందుకుంటే మాత్రం అది కేవలం చరణ్ కెరీర్‌కే కాదు, బుచ్చిబాబు దర్శకుడిగా కూడా మరో భారీ మైలురాయిగా మారడం ఖాయం.







