ఏపీలో త్వరలోనే రాహుల్ గాంధీ పర్యటన..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా పునర్వైభవం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీ కాంగ్రెస్ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys sharmila) నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా.. ఏఐసీసీ (AICC) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో కాక రేపుతోంది. రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకుని రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే సన్నాహాలు షురూ చేశాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, రాబోయే స్థానిక సంస్థల.. పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తీగా ఎదగాలంటే గ్రామస్థాయి నుండి పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగడం ద్వారా క్షేత్రస్థాయి నాయకులలో, కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపవచ్చని, తద్వారా స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వొచ్చని కాంగ్రెస్ గట్టి ప్లాన్ వేసింది.
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న ప్రస్తుత తరుణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మరియు వైఎస్సార్ అభిమానులను తిరిగి హస్తం గూటికి చేర్చడమే రాహుల్ గాంధీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. జగన్ కంటే వైఎస్ షర్మిలకే వైఎస్సార్ అసలైన రాజకీయ వారసత్వం ఉందనే మెసేజ్‌ను ఈ బహిరంగ సభ వేదికగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు.
రాహుల్ గాంధీ ఏపీ పర్యటనలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని కాంగ్రెస్ ప్రధాన అస్త్రాలుగా ఎంచుకోనుంది. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకత వంటి కీలక సెంటిమెంట్ అంశాలపై రాహుల్ గాంధీ ఈ వేదిక నుండి గళం విప్పనున్నారు. ఈ పర్యటనతో ఏపీలో కాంగ్రెస్ మళ్లీ ప్రధాన రాజకీయ శక్తీగా మారుతుందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తాము ఊహించని ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.







