జైలర్2 వేట ఆగేదెప్పుడు?
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్2(Jailer2)పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dileep kumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మేజర్ భాగం పూర్తైనట్టు సమాచారం. అయితే సినిమాలో కీలకమైన ఓ క్యామియో పాత్ర కోసం మాత్రం మేకర్స్ ఇంకా సరైన నటుడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ కోసం పలువురు స్టార్ హీరోలను సంప్రదించినప్పటికీ, చాలా మంది నటులు ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
మొదట బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh khan) ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ బలంగా వినిపించింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని కోలీవుడ్ వర్గాలు స్పష్టం చేశాయి. అంతకు ముందు తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను కూడా మేకర్స్ సంప్రదించినట్లు, అయితే ఆయన ఈ స్పెషల్ రోల్ ను చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మరోవైపు తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) మాత్రం ఈ సినిమాలో భాగమైనట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు తాజాగా ఆ స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కషన్స్ కొనసాగుతున్నాయని, ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదని సమాచారం. ఇదిలా ఉంటే జైలర్2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.







