మెగా ఫోన్ పట్టనున్న సినిమాటోగ్రాఫర్
ఇండియన్ సినిమాలో విజువల్ గ్రాండియర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమాటోగ్రాఫర్లలో ఆర్. రత్నవేలు(R. Ratnavelu) పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. తన కెమెరా పనితనంతో ఎన్నో సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఆయన, ఇప్పుడు డైరెక్టర్ గా కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే మూడు కథలను సిద్ధం చేసుకున్నానని వెల్లడించిన రత్నవేలు, సరైన టైమ్ వచ్చినప్పుడు మెగా ఫోన్ పట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాలనే ఆలోచన తనలో బలంగా ఉందని ఆయన పేర్కొనడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన పెద్ది(Peddi) రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను రత్నవేలు పంచుకున్నారు. కథ నడిచే కాలానికి తగ్గట్టుగా విజువల్ టోన్‌ను డిజైన్ చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. దాదాపు నలభై ఏళ్ల క్రితం విజయనగరం ప్రాంత వాతావరణాన్ని గుర్తు చేసేలా స్పెషల్ కలర్ ప్యాలెట్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. కొన్ని కీలక సన్నివేశాలను డిజిటల్‌కు బదులుగా ఫిల్మ్ నెగెటివ్పై షూట్ చేయడం ద్వారా సహజత్వాన్ని మరింత పెంచే ప్రయత్నం చేసినట్టు తెలిపారు.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో తెరకెక్కించిన క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని రత్నవేలు నమ్మకం వ్యక్తం చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ నిజమైన గ్రామీణ అనుభూతి కనిపించేలా షూటింగ్ సాగిందని చెప్పారు. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తుందని వెల్లడించారు. కెమెరా వెనుక తన ప్రతిభతో ఎన్నో ప్రపంచాలను సృష్టించిన రత్నవేలు, దర్శకుడిగా ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో మరింత పెరుగుతోంది.







