సర్కారు దవాఖానాల్లో ప్రైవేటు మెడికల్ దందా.. రోగులపై అదనపు భారం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ప్రధాన సర్కారు దవాఖానాల ఆవరణలో ప్రైవేటు మెడికల్ షాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రులలో టెండర్లు లేకుండానే, లీజు గడువు ముగిసినా పాతవారే దుకాణాలను కొనసాగిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వైద్యారోగ్య శాఖ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
రూ.3 కోట్ల అద్దె బకాయిలు..
గాంధీ ఆసుపత్రి ఆవరణలో ప్రస్తుతం మూడు ప్రైవేటు మెడికల్ షాపులు నడుస్తున్నాయి. వీటి లీజు గడువు ఎప్పుడో ముగిసిపోయింది. నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడేళ్లకు కొత్తగా టెండర్లు పిలిచి దుకాణాలను కేటాయించాల్సి ఉండగా.. ఇక్కడ గత పదేళ్లుగా టెండర్లు లేకుండానే పాతవారే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ దుకాణాలకు పదేళ్ల క్రితం నామమాత్రపు అద్దెలను నిర్ణయించారు. ఒక్కో షాపు రోజుకు దాదాపు రూ. లక్ష వరకు వ్యాపారం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన నామమాత్రపు అద్దెలను కూడా సకాలంలో కట్టడం లేదు. ఇలా గాంధీ ఆసుపత్రికి రావాల్సిన అద్దె బకాయిలు సుమారు రూ. 3 కోట్ల వరకు పేరుకుపోవడం గమనార్హం. ఒక్కో దుకాణదారుడి నుండి రూ. లక్షల బకాయిలు ఉన్నా వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
మందుల కొరతే వ్యాపారులకు వరం..
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు ఏటా రోగుల రద్దీ 20 నుండి 25 శాతం పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా బడ్జెట్ నిధుల నుండి మందుల కేటాయింపులు పెరగడం లేదు. ప్రభుత్వం కేవలం 80 శాతం మందులను మాత్రమే సరఫరా చేస్తుండగా, మిగిలిన 20 శాతం అత్యవసర మందులను ఆసుపత్రి బడ్జెట్ నుంచి కొనాల్సి వస్తోంది. అయితే రోగుల సంఖ్యతో పోలిస్తే మందుల సరఫరా తక్కువగా ఉండటం వల్ల, వైద్యులు రాసే అన్ని మందులను ప్రభుత్వ ఫార్మసీలు అందించలేకపోతున్నాయి. వైద్యులు రాసే ఆరు రకాల మందులలో కేవలం నాలుగు లేదా మూడు రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఈ కొరతను ప్రైవేటు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రోగులు విధిలేని పరిస్థితుల్లో ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. కొందరు వైద్యులకు, ప్రైవేటు మందుల దుకాణాలకు మధ్య లోపాయికారీ అవగాహన ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నిమ్స్‌లో రోగుల పట్ల దౌర్జన్యం..
నిమ్స్ ఆసుపత్రిలో ప్రైవేటు మెడికల్ షాపుల నిర్వాహకులు మరింత బరితెగిస్తున్నారు. ఇటీవల నిమ్స్‌లో మందులు కొనడానికి వచ్చిన ఒక యువతి కుటుంబ సభ్యులను, తమ షాపులోనే మందులు కొనాలంటూ ప్రైవేటు దుకాణదారులు ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఆమె నిలదీయడంతో సదరు వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. వైద్యులు రాసిన మందులు కాకుండా, తమకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే వేరే కంపెనీల (ఫార్ములా) మందులను రోగులకు అంటగడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిమ్స్‌లోకి రోజువారీగా ప్రైవేటు మందుల కంపెనీల ప్రతినిధుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటోంది. హార్మోన్ థెరపీ, క్యాన్సర్ , ఇతర ఖరీదైన మందులను భారీ డిస్కౌంట్లతో ఇస్తామని చెప్తూ రోగులతో నేరుగా మట్లాడుతున్నారని, వీరికి కొందరు వైద్యుల సహకారం కూడా అందుతోందని తెలుస్తోంది.
మంత్రి ఆదేశించినా తప్పని జాప్యం..
ఈ ప్రైవేటు మెడికల్ దందా , అద్దె బకాయిల వ్యవహారం వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుకాణాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించగా, వ్యాపారులు కోర్టు నుంచి ‘స్టే’ తెచ్చుకున్నారు. అయితే కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించి ఆ స్టేను వెకేట్ చేయించడంలో అధికారులు తీవ్ర జాప్యం వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.







