బ్యూఫోర్ట్ క్యాజిల్ ఎందుకంత కీలకం..?
బ్యూఫోర్ట్ క్యాజిల్ (Beaufort Castle) అనేది దక్షిణ లెబనాన్‌లో ఉన్న ఒక చారిత్రాత్మక, వ్యూహాత్మకమైన కొండకోట. అరబిక్‌లో దీనిని ‘ఖలత్ అల్-షకీఫ్’ (Qal’at al-Shaqif) అని పిలుస్తారు, దీని అర్థం “ఎత్తైన బండరాతి కోట”. ఇటీవల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఈ కోటను స్వాధీనం చేసుకోవడంతో ఇది మళ్లీ అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.
కోట చరిత్ర నిర్మాణం:
దీనిని 12వ శతాబ్దంలో క్రుసేడర్స్ (Crusaders) నిర్మించారు. ఫ్రెంచ్ భాషలో ‘బ్యూఫోర్ట్’ అంటే “అందమైన కోట” అని అర్థం. శతాబ్దాలుగా ఈ కోట పాలకుల చేతులు మారుతూ వచ్చింది. 1190లో సుల్తాన్ సలాద్దీన్ దీనిని స్వాధీనం చేసుకోగా, ఆ తర్వాత అయ్యూబిడ్లు, మమ్లుక్‌లు, అటోమన్లు దీనిపై ఆధిపత్యం చలాయించారు.
వ్యూహాత్మక ప్రాధాన్యత:
బ్యూఫోర్ట్ క్యాజిల్… లితానీ నది, నబాతీయే నగరానికి సమీపంలో ఒక ఎత్తైన కొండపై ఉంది.నిఘా పరంగా ఈ కోటకు అత్యంతప్రాధాన్యత ఉందనే చెప్పాలి. ఇక్కడి నుండి దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్ , సిరియా సరిహద్దు ప్రాంతాలను స్పష్టంగా చూడొచ్చు. అందువల్ల సైనికపరంగా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది.
మొదటి లెబనాన్ యుద్ధం సమయంలో 1982లో ఇజ్రాయెల్ … దీనిని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (PLO) నుండి స్వాధీనం చేసుకుని, 18 ఏళ్ల పాటు తమ సైనిక స్థావరంగా వాడుకుంది. తిరిగి 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్ దళాలు ఇక్కడి నుండి వెనుతిరిగాయి. ఇటీవల ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో, ఇజ్రాయెల్ సైన్యం (IDF గోలాని బ్రిగేడ్) భీకర దాడులు జరిపి బ్యూఫోర్ట్ క్యాజిల్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంది. కోటపై ఇజ్రాయెల్ , గోలాని బ్రిగెేడ్ జెండాలను ఎగురవేసింది








