వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీకి రెడీ..?
ఐపీఎల్ 2026 సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) త్వరలోనే భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ (RR) హెడ్ కోచ్ కుమార సంగక్కర. గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి పాలైన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సంగక్కర మాట్లాడారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన “వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నాడా?” అనే ప్రశ్నకు ఈ లంక దిగ్గజం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
సంగక్కర మాట్లాడుతూ, “సాధారణంగా ఏ ఆటగాడైనా అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగే వరకు వారు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఎవరూ చెప్పలేరు. కానీ వైభవ్ విషయంలో మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. ఈ ఐపీఎల్లో ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. తనపై ఎలాంటి సవాల్ విసిరినా ఎదుర్కొనేందుకు వైభవ్ వంద శాతం సిద్ధంగా ఉన్నాడు. చాలా పరిణతితో బ్యాటింగ్ చేస్తూ ఈ సీజన్లో మా జట్టు ఓపెనింగ్ భాగస్వామ్య బాధ్యతలను అద్భుతంగా భుజానకెత్తుకున్నాడు” అని ప్రశంసించారు.
వైభవ్‌కు త్వరలోనే టీమిండియా నుండి పిలుపు వస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు బీసీసీఐ(BCCI) సెలెక్టర్లకు సంగక్కర ఒక హింట్ ఇచ్చారు.సోషల్ మీడియా నెగెటివిటీకి దూరంగా..ఒక టీనేజర్ అయిన వైభవ్‌ను సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివిటీ నుండి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఎలా కాపాడుతోందనే ప్రశ్నకు కూడా కోచ్ సమాధానమిచ్చారు. “అతడి చుట్టూ మేమొక బలమైన ప్రణాళికను ఏర్పాటు చేశాం. అతడి మనస్సును ఎక్కువగా గందరగోళానికి గురిచేయం. జట్టు సమావేశాల్లో అతడు చురుగ్గా పాల్గొంటాడు, అందరూ చెప్పేది వింటాడు, బౌలర్ల వీడియోలను చూస్తూ హోంవర్క్ బాగా చేస్తాడు. అతడి మైండ్ ప్రశాంతంగా, స్పష్టంగా ఉంచడమే మా లక్ష్యం” అని సంగక్కర తెలిపారు.







