బెంగాల్ తరహాలో .. తెలంగాణలోనూ జరగకుండా చూడాలి : మహేశ్ గౌడ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్)లో భాగంగా పశ్చిమబెంగాల్ (West Bengal) తరహా కుట్రలు తెలంగాణ (Telangana)లోనూ జరగకుండా చూడాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్ పై గాంధీ భవన్ లో ఎంపికచేసిన మాస్టర్ ట్రైనీలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ సర్ లో భాగంగా బెంగాల్లో 60 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించడంతో అక్కడ ప్రభుత్వమే మారిపోయిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేశామని, 90కి పైగా నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్ల (Booth level agents) (బీఎల్ఏ) నియామకమూ పూర్తయిందని చెప్పారు. జిల్లా, మండల కమిటీలనూ దాదాపుగా పూర్తిచేసినట్లు వెల్లడించారు. శిక్షణ అనంతరం మాస్టర్ ట్రైనీలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోని బీఎల్ఏలకు శిక్షణను ఇవ్వనున్నారు.







