శిక్షణ లేదు.. టెస్టులు లేవు.. చేతులు తడిపితే చాలు డ్రైవింగ్ లైసెన్స్
RTA Office: రవాణా శాఖ సేవలను డిజిటలైజ్ చేస్తూ, పౌరులకు దళారుల వేధింపులు లేకుండా సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘వాహన్ పోర్టల్’ను అమల్లోకి తెచ్చింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఆన్లైన్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ, ఆర్టీఓ (RTO) కార్యాలయాల్లో దళారుల హవా యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నగర శివార్లలోని మేడ్చల్, పేట్‌బషీరాబాద్, కొండాపూర్ రవాణా కార్యాలయాల్లో ఏకకాలంలో జరిపిన ఆకస్మిక సోదాల్లో ఈ దందా బహిర్గతమైంది. ఈ తనిఖీల్లో భాగంగా ఆర్టీఓ కార్యాలయాల ఆవరణలో తిష్టవేసిన పలువురు మధ్యవర్తులను, ప్రైవేటు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.
దళారులు ధరను నిర్ణయించి..
సౌకర్యవంతమైన ఆన్లైన్ వ్యవస్థ ఉన్నప్పటికీ, సాధారణ వాహనదారులకు మాత్రం ఏజెంట్ల వేధింపులు తప్పడం లేదు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని, అన్ని సరైన పత్రాలతో నేరుగా వెళ్లే పౌరులకు ఏదో ఒక సాకుతో తిరస్కరిస్తూ వెనక్కి పంపుతున్నారు. అదే సమయంలో, ఒక ఏజెంట్‌ను ఆశ్రయిస్తే ఎలాంటి నిబంధనలు లేదా పరీక్షలు లేకుండానే పనులు సులువుగా పూర్తవుతున్నాయి. లెర్నింగ్ లైసెన్స్ (LLR), పర్మనెంట్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ల వంటి ప్రతి పనికీ దళారులు సొంతంగా ఒక ధరను నిర్ణయించి సామాన్యుల నుండి భారీగా వసూలు చేస్తున్నారు. ఏజెంట్లను సంప్రదించకుండా, వారు అడిగినంత ఇచ్చుకోకుండా చిన్న పని కూడా కావడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది.
ఫైళ్లను నిమిషాల వ్యవధిలో..
ఈ అక్రమ దందాలో మోటారు డ్రైవింగ్ స్కూళ్ల పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు సరైన డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, కొన్ని స్కూళ్లు కేవలం డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ఆర్టీఓ కార్యాలయాల్లోని కొంతమంది సిబ్బంది చేతులు తడిపి, అర్హత లేని వారికి సైతం లైసెన్సులు ఇప్పిస్తున్నారు. చివరికి బయోమెట్రిక్, టెస్ట్ డ్రైవ్ సమయాల్లోనూ దళారుల జోక్యం మితిమీరిపోతోంది. నేరుగా వచ్చే సామాన్య పౌరులను గంటల తరబడి వేచి చూసేలా చేస్తూ, అదే దళారుల ద్వారా వచ్చే ఫైళ్లను మాత్రం నిమిషాల వ్యవధిలోనే క్లియర్ చేస్తున్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది.
ఇవి కూడా చదవండి







