గ్రేటర్లో 15 లక్షల రేషన్ కార్డులు.. కానీ సేవల్లో మాత్రం తీవ్ర జాప్యం
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పౌరసరఫరాల శాఖ అధికారుల మధ్య సరైన అవగాహన, సమన్వయం కరువవ్వడం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతంలో సుమారు 15 లక్షలకు పైగా కుటుంబాలకు చెందిన అరకోటి మంది లబ్ధిదారులకు నిత్యావసరాలను సరఫరా చేసే ప్రక్రియలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చీఫ్ రేషనింగ్ అధికారి (CRO) కార్యాలయంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల విభాగాలు ఈ పంపిణీలో భాగస్వాములుగా ఉన్నాయి. సన్న బియ్యం, ఇతర నిత్యావసరాల సరఫరాతో పాటు కొత్త కార్డుల జారీ, తప్పుల సవరణ వంటి కీలక బాధ్యతలను ఈ విభాగాలు నిర్వహిస్తున్నాయి. అయితే అధికారుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల నిత్యావసరాల అక్రమ రవాణాకు దారితీస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు రేషన్ కార్డుల మంజూరు, ధ్రువీకరణ ప్రక్రియల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
పరిశీలనల్లో జాప్యం..
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తులను అసిస్టెంట్ సప్లై ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా పౌరసరఫరాల అధికారి ద్వారా సీఆర్వో కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలు సకాలంలో పూర్తికాకపోవడంతో కొత్త కార్డుల పంపిణీ నిలిచిపోయింది. ముఖ్యంగా జిల్లాల సరిహద్దుల్లో ఉండే కాలనీల దరఖాస్తులు ఏ అధికారి పరిధిలోకి వస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో విచారణలు నెలల తరబడి పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. ఒక జిల్లాలో పంపిణీ మొదలైనా, పొరుగు జిల్లా పరిధిలోకి వచ్చే ప్రజలకు తమ కార్డులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. సమాచారం కోసం ప్రజలు మీసేవ కేంద్రాలు, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
దూరమవుతున్న రేషన్ దుకాణాలు..
రేషన్ సరుకులు తీసుకోవడానికి కొత్త కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇంటి పక్కనే రేషన్ షాపు ఉన్నప్పటికీ, వారి కార్డులు వేరే జిల్లా పరిధిలోకి మారడంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న దుకాణాలకు వెళ్లాల్సి వస్తోంది. కార్డుల సంఖ్య పెరిగిన చోట కొత్త దుకాణాలను ఏర్పాటు చేయకపోవడంతో ఉన్న రేషన్ షాపులపైనే విపరీతమైన రద్దీ పెరుగుతోంది. దీనికి తోడు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. సరుకుల అక్రమ రవాణాపై ఎవరికి వారు తమ పరిధిలోని అంశం కాదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు, గ్రీవెన్స్ సెల్స్ ఉన్నప్పటికీ.. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి.
గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల వివరాలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ కార్డులు , లబ్ధిదారుల గణాంక వివరాలను పరిశీలిస్తే.. మొత్తం నాలుగు జిల్లాల వ్యాప్తంగా 15,90,438 రేషన్ కార్డులు ఉండగా, వాటి ద్వారా 58,37,087 మంది లబ్ధిదారులు నిత్యావసర సరుకులను పొందుతున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 8,41,954 కార్డులు, 32,24,963 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న మేడ్చల్ జిల్లాలో 4,74,855 రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 16,45,039 గా ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లా పరిధిలో 2,50,036 కార్డుల ద్వారా 8,83,620 మంది లబ్ధి పొందుతుండగా, అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 23,593 రేషన్ కార్డులు, 83,465 మంది లబ్ధిదారులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







