ఉల్లంఘనదారులకు అనుకూలంగా మారిన పొల్యూషన్ బోర్డు.. తనిఖీల సమాచారం ముందే లీక్
Hyderabad: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిర్వహిస్తున్న కంప్యూటరైజ్డ్ తనిఖీ విధానంపై తీవ్రమైన అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల్లో ఏ నెలలో తనిఖీలు జరుగుతాయనే సమాచారాన్ని ముందే యాజమాన్యాలకు, అధికారులకు చేరవేయడం వల్ల ఉల్లంఘనదారులకు అది అనుకూలంగా మారుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల లోపాలను ముందే సరిదిద్దుకోవడం లేదా అధికారులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంటోందని తెలుస్తోంది.
ప్రతి నెలా 70 నుండి 120 వరకు పరిశ్రమలలో తనిఖీలు..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ రూపొందించిన ఒక ప్రత్యేక టూల్ ద్వారా ఈ కంప్యూటరైజ్డ్ తనిఖీలను పీసీబీ చేపడుతోంది. ఈ విధానంలో ప్రతి నెలా 70 నుండి 120 వరకు పరిశ్రమలలో తనిఖీలు నిర్వహిస్తుండగా, అందులో దాదాపు 30 వరకు రాజధాని పరిధిలోని మూడు జిల్లాల్లోనే ఉంటున్నాయి. ఏ అధికారి ఎక్కడ తనిఖీ చేయాలో పీసీబీ కార్యాలయంలోని ప్రత్యేక విభాగం నిర్ణయిస్తుంది. ఈ తనిఖీల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచుతున్నారు. అయితే, ఈ పద్ధతిని పక్కనపెట్టి ఆకస్మిక తనిఖీలు చేసేలా ఒక పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుత తనిఖీల ప్రక్రియ..
పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాల తీవ్రతను బట్టి వాటిని రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీలుగా విభజించి ఈ తనిఖీలు జరపాలి. గతంలో నిబంధనలు పాటించిన రికార్డులను బట్టి తనిఖీలను కేటాయిస్తారు. ఇన్ స్పెక్టర్లకు ఈ బాధ్యతలను రాండమ్‌గా లేదా రిస్క్ ఆధారంగా టూల్ ద్వారా కేటాయించడం జరుగుతుంది. తనిఖీ పూర్తయిన తర్వాత వాటర్, ఎయిర్ యాక్ట్‌ల ప్రకారం 72 గంటల్లోగా ఇన్స్పెక్షన్ రిపోర్టును ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. వ్యర్థాల శుద్ధి, వాయు కాలుష్య మూలాలు, నియంత్రణ పరికరాలు, ప్రమాదకర వ్యర్థాల ఉత్పత్తి , వాటి నిల్వ, పారవేత వంటి కీలక అంశాలను ఈ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది.
‘జనవాణి’కి ప్రతి నెలా 50కి పైగా ఫిర్యాదులు..
మరోవైపు, ఆన్లైన్ ఫిర్యాదుల విభాగమైన ‘జనవాణి’కి ప్రజల నుండి ప్రతి నెలా 50కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా వ్యర్థాలను ఇష్టానుసారంగా పారబోయడం, చెత్తను దహనం చేయడం, పరిశ్రమల నుండి వెలువడే ఘాటైన వాసనలు వంటి సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయా పరిశ్రమలలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, ఆ నివేదికలను నేరుగా డాష్ బోర్డులో బహిరంగంగా ఉంచితే వ్యవస్థలో మరింత పారదర్శకత పెరుగుతుందని ప్రజల నుండి డిమాండ్లు వినపిస్తున్నాయి.







