ఉప్పెనలో ఆ పాత్ర ముందు నా వద్దకే వచ్చింది
తెలుగు సినీ పరిశ్రమలో తొలి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరడం అరుదైన ఘనత. అలాంటి సంచలన సక్సెస్ ను అందుకున్న సినిమా ఉప్పెన(Uppena). మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej), హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty), డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana)లకు ఈ సినిమా కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ కు కేంద్రబిందువుగా నిలిచిన పాత్ర రాయణం. ఈ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తన యాక్టింగ్ తో సినిమాకి మరింత బలం చేకూర్చారు. ముఖ్యంగా కూతురిపై అతని అధికారం, గౌరవం, ఆవేశం కలిసిన తీరు ప్రేక్షకులపై గాఢమైన ప్రభావం చూపింది.
అయితే ఈ పాత్రకు మొదటగా మరో ప్రముఖ నటుడిని పరిశీలించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu) తాజాగా జరిగిన పెద్ది(Peddi) ప్రమోషన్స్ సందర్భంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఉప్పెనలో రాయణం పాత్ర కోసం డైరెక్టర్ బుచ్చిబాబు తనను సంప్రదించేందుకు ఇంటి వరకు వచ్చారని, కానీ చివరి క్షణంలో తిరిగి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. ఆ తర్వాత బుచ్చిబాబు స్వయంగా కాల్ చేసి, మార్కెట్ పరంగా విజయ్ సేతుపతి అయితే పాత్రకు మరింత ఉపయోగపడతారని భావించినట్టు చెప్పారని జగపతి బాబు వెల్లడించారు.
ఈ సందర్భంలో దర్శకుడి నిజాయితీ తనకెంతో నచ్చిందని జగపతి బాబు చెప్పడం విశేషం. సాధారణంగా ఇలాంటి విషయాలను స్పష్టంగా చెప్పడానికి చాలా మంది వెనుకాడుతుంటారు. కానీ బుచ్చిబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిజాయితీగా వివరించడం తనకు గౌరవంగా అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.







