జాబిల్లి చీకటి గుంతల్లో దొరికిన మంచు.. ఆశలు రేపుతున్న ‘చంద్రయాన్-2’ రిపోర్ట్!
చంద్రయాన్-2 ల్యాండర్ ఫెయిల్ అయిందని ఒకప్పుడు నిరాశపడిన వారికి, అలాగే అంతరిక్ష రేసులో పోటిపడుతున్న ప్రపంచ దేశాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ చెప్పింది. ల్యాండర్ క్రాష్ అయినా, గత ఏడేళ్లుగా చంద్రుడి (Moon) చుట్టూ సైలెంట్‌గా తిరుగుతున్న ‘చంద్రయాన్-2 ఆర్బిటార్’ ఇప్పుడు ఒక సంచలన విషయాన్ని కనిపెట్టింది. సౌర కుటుంబంలోనే అత్యంత రహస్యమైన, సూర్యరశ్మి అస్సలు పడక మైనస్ 248 డిగ్రీల గడ్డకట్టే చలి ఉండే చంద్రుని దక్షిణ ధ్రువంలో భారీగా మంచు (Water-Ice) నిల్వలు ఉన్నట్లు పక్కా ఆధారాలతో కనిపెట్టింది.
రాడార్ కంటికి చిక్కిన రహస్యం..
అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు ఆర్బిటార్ పంపిన డేటాను లోతుగా విశ్లేషించి ఈ నిజాన్ని ప్రపంచం ముందుంచారు. చంద్రయాన్-2 ఆర్బిటార్‌లోని ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్’ (DFSAR) ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసింది. ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలలో పనిచేసే ఈ అత్యాధునిక పరికరం చంద్రుడి (Moon) ఉపరితలం కింది భాగంలోకి మైక్రోవేవ్ సంకేతాలను పంపి చీకటి గుట్టును రట్టు చేసింది. సాధారణ రాళ్లు, దుమ్ము కంటే మంచు ఈ రాడార్ సంకేతాలను భిన్నంగా వెనక్కి (పరావర్తనం) పంపుతుంది. దీని ఆధారంగా దక్షిణ ధ్రువంలోని డబ్లీ షాడోడ్ క్రేటర్ల కింద బిలియన్ల సంవత్సరాల నాటి మంచు ఉన్నట్లు స్పష్టమైంది.
ఉపరితలం కింద భారీ నిల్వలు..
శాస్త్రవేత్తలు పరిశోధించిన తొమ్మిది భారీ గుంతలలో.. ‘ఫాస్టిని క్రేటర్’ లోపల ఉన్న 1.1 కిలోమీటర్ల వ్యాసం గల ఒక చిన్న గుంతలో ఈ మంచుకు సంబంధించిన అత్యంత బలమైన ఆధారాలు లభించాయి. అయితే ఈ మంచు నేరుగా చంద్రుడి (Moon) ఉపరితలంపై లేదు. భవిష్యత్తులో వ్యోమగాములు సులభంగా సేకరించడానికి వీల్లేకుండా, లోపల భూగర్భంలో భద్రంగా దాగి ఉంది. కోట్ల ఏళ్ల క్రితం ఒక ఉల్క చంద్రుడిని బలంగా ఢీకొట్టినప్పుడు, లోపల ఉన్న మంచు నిల్వలు ద్రవరూపంలోకి మారి పక్కకు ప్రవహించి, మళ్లీ అక్కడే గడ్డకట్టుకుపోయినట్లుగా ఉన్న ప్రత్యేక ఆకారాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ మంచు దొరికితే జరిగేదిదే..
భూమి మీద నుంచి అంతరిక్షంలోకి నీటిని, ఇంధనాన్ని మోసుకెళ్లడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు చంద్రుడిపై (Moon) దొరికిన ఈ మంచును రసాయన ప్రక్రియల ద్వారా స్వచ్ఛమైన తాగునీరుగా, వ్యోమగాములు పీల్చుకునే ఆక్సిజన్‌గా, చివరికి రాకెట్ ఇంధనంగా కూడా మార్చుకోవచ్చు! ఈ అద్భుతమైన అవకాశం వల్లే ఇప్పుడు అమెరికా నాసా (NASA) ఆర్టెమిస్ ప్రోగ్రామ్, చైనా లూనార్ మిషన్లు అన్నీ కూడా చంద్రుని దక్షిణ ధ్రువంపైనే కన్నేశాయి.
కానీ ఆ అగ్రరాజ్యాల కంటే ముందే అక్కడి అణువణువు రహస్యాలను ఇస్రో పసిగట్టి ప్రపంచ అంతరిక్ష రేసులో తన సత్తా చాటింది. 2023లో చంద్రయాన్-3 సృష్టించిన చారిత్రక (Moon) ల్యాండింగ్ విజయానికి, ఇప్పుడు చంద్రయాన్-2 ఆర్బిటార్ అందిస్తున్న ఈ డేటా తోడవడంతో గ్లోబల్ స్పేస్ సెక్టార్లో భారతదేశం తిరుగులేని శక్తిగా అవతరించిందని విశ్లేషకులు అంటున్నారు.







