వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ వాడుతున్నారా? యూజర్లకు షాకిచ్చిన మెటా!
సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) తన యూజర్లకు సంచలన వార్త చెప్పింది. ఇప్పటివరకు పూర్తి ఉచితంగా సేవలందించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్‌లలో ఇకపై సరికొత్త శకం మొదలుకాబోతోంది. అదనపు ప్రీమియం ఫీచర్లు, పర్సనలైజ్డ్ ఆప్షన్లు కోరుకునే యూజర్ల కోసం ‘ప్లస్’ (Plus) పేరుతో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను మెటా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్లస్ ధర రూ. 380
ముందుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్ల విషయానికొస్తే.. ‘ప్లస్’ సబ్స్క్రిప్షన్ ధరను నెలకు 3.99 డాలర్లు (సుమారు రూ. 380)గా నిర్ణయించారు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి మామూలు యూజర్లకు లేని ఎన్నో వీఐపీ ఫీచర్లు అందుతాయి. మీ స్టోరీలను ఎవరెవరు పదే పదే చూశారో (Rewatch insights) ఇట్టే తెలుసుకోవచ్చు. 24 గంటల కంటే ఎక్కువ సమయం స్టోరీని లైవ్‌లో ఉంచడం, అలాగే అవతలి వారికి ఏమాత్రం తెలియకుండా సీక్రెట్‌గా వారి స్టోరీలను ప్రివ్యూ చూడటం వంటి క్రేజీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటికి తోడు ప్రొఫైల్ కస్టమైజేషన్, కస్టమ్ యాప్ ఐకాన్లు, యానిమేటెడ్ రియాక్షన్లు, వీక్లీ స్పాట్లైట్ బూస్ట్లు అదనంగా లభిస్తాయి. అయితే డబ్బులు కట్టినప్పటికీ యాడ్స్ (Ads) రాకుండా ఉంటాయా లేదా అనేదానిపై మెటా (Meta) ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
వాట్సాప్ ప్లస్ ధర రూ. 284
మనందరికీ అత్యంత కీలకమైన వాట్సాప్ కోసం ‘వాట్సాప్ ప్లస్’ (WhatsApp Plus) అందుబాటులోకి వచ్చింది. దీని ధర నెలకు 2.99 డాలర్లు (సుమారు రూ. 284). దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. పాత బోర్ కొట్టే స్క్రీన్కు బదులు సరికొత్త కస్టమ్ థీమ్స్, ఎక్స్‌క్లూజివ్ రింగ్టోన్లు, ప్రీమియం స్టిక్కర్లతో పాటు, ఎక్కువ సంఖ్యలో ముఖ్యమైన చాట్లను పిన్ చేసుకునే సదుపాయం లభిస్తుంది.
అసలు స్కెచ్ ఇదే!
ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. సాధారణ యూజర్లకే కాకుండా క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్ల కోసం మరిన్ని ఏఐ (AI) ఫీచర్లతో కూడిన ప్లాన్లను మెటా (Meta) తీసుకురాబోతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ప్లాన్లన్నింటినీ భవిష్యత్తులో ‘మెటా వన్’ (Meta One) అనే బ్రాండ్ కింద విలీనం చేయనుంది. ఇందులో మెటా వన్ ప్లస్ నెలకు 7.99 డాలర్లు (సుమారు రూ. 760), మెటా వన్ ప్రీమియం నెలకు 19.99 డాలర్లు (సుమారు రూ. 1900)గా ఉండనున్నాయి.
అకస్మాత్తుగా ఎందుకీ బాదుడు?
ఇన్నేళ్లుగా ఫ్రీగా సేవలిచ్చిన మెటా (Meta) ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు డబ్బులు వసూలు చేస్తోందనే దానికి ఒక బలమైన కారణం ఉంది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దే కాబట్టి, ఆ ఏఐ మౌలిక సదుపాయాలు, భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం మెటాకు వేల కోట్ల నిధులు అవసరం. ఆ అదనపు ఆదాయ వనరులను ఏఐ డెవలప్మెంట్ కోసం సమకూర్చుకునేందుకే మెటా ఈ ‘సబ్స్క్రిప్షన్’ అస్త్రాన్ని ప్రయోగించిందని టెక్ విశ్లేషకులు అంటున్నారు.







