రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి సర్ప్రైజ్.. వచ్చేసిన అత్యంత పవర్ఫుల్ ‘బుల్లెట్ 650’!
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైక్ అంటే అదొక వాహనం కాదు, భారతీయ యువతకు అదొక ఎమోషన్. దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలుగొందుతున్న తమ ఐకానిక్ ‘బుల్లెట్’ బ్రాండ్‌లో కంపెనీ ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత పవర్ఫుల్ మోటార్‌సైకిల్ ‘బుల్లెట్ 650’ (Bullet 650) భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ధర, రంగులు ఎలా ఉన్నాయంటే..
తాజాగా మార్కెట్లోకి విడుదలైన ఈ బుల్లెట్ 650 (Royal Enfield) ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 3.64 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ కస్టమర్లను ఆకట్టుకునేలా కానన్ బ్లాక్ (Cannon Black), బ్యాటిల్‌షిప్ బ్లూ (Battleship Blue) అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 350సీసీకే పరిమితమైన బుల్లెట్ బ్రాండ్.. తొలిసారిగా 650సీసీ ప్లాట్‌ఫామ్‌పైకి అప్‌గ్రేడ్ కావడం బైక్ లవర్స్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పాత దర్జా.. కొత్త టెక్నాలజీ!
బుల్లెట్ 650లో కంపెనీ (Royal Enfield) అత్యంత తెలివిగా ఒకప్పటి వింటేజ్ లుక్‌ను, నేటి మోడ్రన్ టెక్నాలజీని మిక్స్ చేసింది. బుల్లెట్ బైక్‌లకే ప్రత్యేకమైన ఆ పాతకాలపు దర్జాను ఏమాత్రం చెడగొట్టకుండా కంపెనీ జాగ్రత్తపడింది. ఆకర్షణీయమైన టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, దానిపై చేతితో అందంగా వేసిన గోల్డ్ పిన్స్ట్రైప్స్, సింగిల్-పీస్ సౌకర్యవంతమైన బెంచ్ సీటు పాత క్లాసిక్ బుల్లెట్‌ను గుర్తుచేస్తాయి. ముందువైపు 19-అంగుళాల వీల్, వెనుకవైపు 18-అంగుళాల వీల్స్ ఈ బైక్‌కు మరింత గంభీరమైన లుక్ ఇచ్చాయి.
పవర్ఫుల్ ఇంజిన్.. స్మూత్ రైడింగ్!
ఇందులో అత్యంత శక్తివంతమైన ప్యారలల్ ట్విన్ 650సీసీ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, అత్యుత్తమమైన షోవా (Showa) సస్పెన్షన్ సిస్టమ్ జతచేయడంతో (Royal Enfield) రైడింగ్ అనుభవం అత్యంత స్మూత్‌గా ఉండనుంది. సిటీ ట్రాఫిక్‌లో తిరగడానికి, అలాగే లాంగ్ డ్రైవ్స్ వెళ్లడానికి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఇంజినీర్లు డిజైన్ చేశారు.
ఫీచర్లు అదుర్స్..
లుక్ పాతదే అయినా, ఫీచర్లు మాత్రం అన్నీ లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్లుగానే ఇచ్చారు. డిజిటల్ ఎల్సీడీ (LCD) డిస్ప్లే, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్‌తో పాటు సరికొత్త ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్ ఈ బైక్ (Royal Enfield) సొంతం. ఎన్ఫీల్డ్ సిగ్నేచర్ అయిన ‘టైగర్ ఐ’ పైలట్ ల్యాంప్స్, పీషూటర్ ఎగ్జాస్ట్ సైలెన్సర్ (సైలెన్సర్ బీట్ కోసం), రెట్రో స్టైల్ స్విచ్‌గేర్ అదనపు ఆకర్షణలు. రైడర్లు తమ అభిరుచికి, అవసరాలకు అనుగుణంగా ఈ బైక్‌ను మార్చుకునేందుకు పెద్ద ఎత్తున యాక్సెసరీస్ అందుబాటులో ఉంచినట్లు ఐషర్ మోటార్స్ సీఈఓ బి. గోవిందరాజన్ వెల్లడించారు. మొత్తానికి భారీ పవర్, క్లాసిక్ లుక్ కోరుకునే బుల్లెట్ అభిమానులకు (Royal Enfield) ఈ ‘బుల్లెట్ 650’ ఒక బెస్ట్ ఆప్షన్ అని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.







