ముఖేష్ అంబానీ శాలరీ ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఆరేళ్లుగా అదే జీతం!
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు, బోనస్‌లు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటే.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukhesh Ambani) మాత్రం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తన సొంత కంపెనీ నుంచి వరుసగా ఆరో ఏడాది కూడా ఆయన ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు! 2020లో కరోనా మహమ్మారి సమయంలో సంస్థ, దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా స్వచ్ఛందంగా తన వేతనాన్ని వదులుకున్న ఆయన.. అదే సంప్రదాయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించి గ్లోబల్ కార్పొరేట్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.
జీతం సున్నా.. ఆదాయం వేల కోట్లు!
జీతం తీసుకోనప్పటికీ, ఆయన ఆదాయానికి ఏమాత్రం లోటు లేదు. అంబానీ (Mukhesh Ambani) అసలు ఆదాయం అంతా రిలయన్స్ షేర్ల పై వచ్చే ‘డివిడెండ్ల’ (Dividends) రూపంలోనే వస్తోంది. రిలయన్స్ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై రూ.6 డివిడెండ్‌ను ప్రకటించింది. ముఖేష్ అంబానీ పేరిట వ్యక్తిగతంగా ఉన్న 1.61 కోట్ల షేర్ల ద్వారా ఏకంగా రూ.9.66 కోట్లు ఆయన ఖాతాలో జమయ్యాయి. ఇక అంబానీ కుటుంబానికి చెందిన ప్రమోటర్ గ్రూప్ చేతిలో ఉన్న భారీ వాటాల ద్వారా ఏకంగా రూ.3,987 కోట్ల దిమ్మతిరిగే ఆదాయం డివిడెండ్ల రూపంలో రావడం గమనార్హం.
అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్!
ఒకవైపు యజమాని (Mukhesh Ambani) జీతం తీసుకోకపోయినా, రిలయన్స్ సంస్థ మాత్రం రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభాలు మునుపెన్నడూ లేనివిధంగా రూ.95,754 కోట్లకు చేరాయి. రిలయన్స్ మార్కెట్ వాల్యూ (క్యాపిటలైజేషన్) సైతం రూ.18.19 లక్షల కోట్లకు ఎగబాకింది. వాస్తవానికి 2008 నుంచి 2020 వరకు కూడా అంబానీ తన వార్షిక వేతనాన్ని కేవలం రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. ఒక బడా కార్పొరేట్ దిగ్గజం ఇలా తన జీతాన్ని పూర్తిగా వదులుకోవడం అత్యుత్తమ ‘కార్పొరేట్ గవర్నెన్స్’కు (సంస్థాగత పాలన) నిదర్శనమని ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు.
వారసుల జీతాలు ఎలా ఉన్నాయంటే..
అంబానీ జీతం తీసుకోకపోయినా, కంపెనీ ఉన్నతాధికారులకు, ఆయన (Mukhesh Ambani) వారసులకు మాత్రం భారీగానే పారితోషికాలు అందుతున్నాయి. రిలయన్స్ టాప్ మేనేజ్మెంట్లో కీలకమైన ఆయన బంధువులు నిఖిల్, హితల్ మెస్వానీలు తలా రూ.25 కోట్ల వేతనం అందుకుంటుండగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ ప్యాకేజీ రూ.20.58 కోట్లకు పెరిగింది. ఇక వారసుల విషయానికొస్తే.. ఆకాష్, ఈషా అంబానీలు బోర్డు సమావేశాలకు కేవలం సిట్టింగ్ ఫీజు, కమీషన్ మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఇటీవల రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంత్ అంబానీ రూ.12.17 కోట్ల పారితోషికం అందుకున్నారు. 2029 వరకు రిలయన్స్ చైర్మన్ హోదాలో కొనసాగనున్న ముఖేష్ అంబానీ (Mukhesh Ambani).. అప్పటివరకు తాను కంపెనీ నుంచి ఎటువంటి జీతం తీసుకోబోనని అధికారికంగా ప్రకటించి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు.







