శ్రీవిష్ణు టార్గెట్ అదేనా?
టాలీవుడ్లో కామెడీ ఎంటర్టైనర్స్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. సామజవరగమన వంటి సూపర్‌హిట్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించిన శ్రీ విష్ణు, అదే డైరెక్టర్ రామ్ అబ్బరాజు(Ram Abbaraju)తో మరోసారి చేతులు కలిపాడు. ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి కావడంతో మూవీ టీమ్ మంచి ఉత్సాహంలో ఉన్నట్లు సమాచారం. సామజవరగమన ఇచ్చిన విజయంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా సెట్స్‌పై హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు ఫుల్ ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా ఈసారి కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వినోదం అందించాలనే టార్గెట్ తో కథను డిజైన్ చేసినట్లు సమాచారం. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ సజావుగా సాగుతుండగా, త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ వంటి అప్డేట్స్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు రచయితలుగా భాను భోగవరపు(Bhanu Bhogavarapu), నందు(Nandu) పనిచేస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యేర్నేని(Naveen Yerneni), వై. రవిశంకర్(Y. Ravi Shankar) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో వెన్నెల కిషోర్(Vennela Kishore), సుదర్శన్(Sudarshan) కీలక పాత్రల్లో కనిపించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ నటుల సమక్షంలో సినిమా వినోదం డోస్ మరింత పెరగనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.







