సీఎం కుర్చీ డీకేకే.. ప్రమాణ స్వీకారంలో హైకమాండ్ స్కెచ్?
కర్ణాటక రాజకీయాల్లో గత రెండున్నరేళ్లుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఎప్పటినుంచో సీఎం కుర్చీ కోసం పట్టుబడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు (DK Shivakumar) లైన్ క్లియర్ అయింది. సీనియర్ నేత సిద్దరామయ్య గురువారం నాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ముగిసిన ‘రెండున్నరేళ్ల’ కోల్డ్ వార్!
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన నాటి నుంచి సిద్దూ, డీకే వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. నాడు కాంగ్రెస్ హైకమాండ్ కుదిర్చిన ‘చెరో రెండున్నరేళ్లు’ పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారమే ఇప్పుడు సిద్దరామయ్య తన పదవి నుంచి గౌరవంగా తప్పుకున్నారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తాను చెప్పలేనని, అది పూర్తిగా అధిష్టానం నిర్ణయమేనని సిద్దరామయ్య వ్యాఖ్యానించడంతో మళ్లీ సస్పెన్స్ మొదలైంది. దీంతో తన సీఎం కుర్చీని కన్ఫర్మ్ చేసుకునేందుకు డీకే శివకుమార్ (DK Shivakumar) శుక్రవారం హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీ తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ప్రమాణస్వీకారానికి ముహూర్తం..!
ఢిల్లీ నుంచి డీకే తిరిగి రాగానే శనివారం నాడు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) సమావేశం నిర్వహించనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శనివారమే ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే దైవభక్తి, జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar).. తన వ్యక్తిగత జ్యోతిష్కుడి సలహా మేరకు మంచి ముహూర్తం కోసం ఆదివారానికి ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసుకునే అవకాశం కూడా ఉంది. మాజీ సీఎంలు రామకృష్ణ హెగ్డే, ఎస్ఎం కృష్ణల తరహాలో.. బెంగళూరులోని ప్రతిష్టాత్మక విధానసభ మెట్లపై అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీకే కలలు కంటున్నారు.
హైకమాండ్ ‘రాజ్యసభ’ భయం!
అయితే ఇక్కడే కాంగ్రెస్ అధిష్టానం ఒక భారీ పొలిటికల్ స్కెచ్ వేసింది. డీకేతో (DK Shivakumar) పాటు పూర్తి స్థాయి కేబినెట్‌తో ప్రమాణం చేయించాలని తొలుత భావించినా.. వ్యూహాత్మకంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. జూన్ 18న రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections) జరగనున్నాయి. ఒకవేళ ఇప్పుడు పూర్తి మంత్రివర్గాన్ని ప్రకటిస్తే, పదవులు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురై.. రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల ట్రాప్‌లో పడి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అందుకే విపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా, అసమ్మతి సెగలు రేగకుండా.. ప్రస్తుతానికి కేవలం కొద్దిమంది మంత్రులతో కూడిన ‘పాక్షిక కేబినెట్’తో మాత్రమే ప్రమాణస్వీకారం చేయించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం మేరకే ముందడుగు పడితే, విధానసభ మెట్లపై అట్టహాసంగా కాకుండా.. లోక్‌భవన్‌లోని ‘గ్లాస్ హౌస్’లో నిరాడంబరంగా డీకే (DK Shivakumar) ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా, రాబోయే 48 గంటల్లో కర్ణాటక పాలిటిక్స్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారనున్నాయి.
ఇవి కూడా చదవండి







