సీఎం కుర్చీ వదిలేసిన సిద్దరామయ్య.. హైకమాండ్ ఆఫర్ రిజెక్ట్..!
కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ అగ్రనేత, మాస్ లీడర్ సిద్దరామయ్య (CM Siddaramaiah) తన పదవికి రాజీనామా చేశారు. గురువారం నాడు లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఇక్కడే ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తన స్వస్థలమైన ఇండోర్‌కు వెళ్లడంతో, సిద్దరామయ్య తన రాజీనామాను గవర్నర్ స్పెషల్ సెక్రెటరీకి అందజేశారు. రాజ్యాంగబద్ధంగా దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడాల్సి ఉన్నందున, ఆయన తిరిగొచ్చాకే ఈ ప్రక్రియ అధికారికంగా పూర్తి కానుంది. మరోవైపు తమ ఆరాధ్య నేత అకస్మాత్తుగా సీఎం కుర్చీ దిగిపోవడంతో కర్ణాటక వ్యాప్తంగా సిద్దూ అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనలకు దిగారు.
ఇవి కూడా చదవండి
అనుకోకుండా వచ్చా.. సీఎం అయ్యా!
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య (CM Siddaramaiah) భావోద్వేగానికి గురయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. “నేను ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తిని. నా కుటుంబంలో ఏ ఒక్కరికీ రాజకీయ నేపథ్యం లేదు. అసలు నేను పాలిటిక్స్‌లోకి రావడమే ఒక పెద్ద యాక్సిడెంట్. జీవితంలో ఎమ్మెల్యే అవుతానని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రిని అయ్యాను. ఇదంతా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైంది” అని ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. 2006 నుంచి తనను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, తనకు ఇంతగొప్ప అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు ఆయన (CM Siddaramaiah) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైకమాండ్ ఆదేశిస్తే వెంటనే తప్పుకుంటానని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడే తాను ఈ రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.
రాజ్యసభ ఆఫర్ తిరస్కరణ..
ఇదిలా ఉంటే సిద్దరామయ్య (CM Siddaramaiah) అపార అనుభవాన్ని జాతీయ స్థాయిలో వాడుకోవాలని, ఆయన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక ఆఫర్ ఇచ్చింది. కానీ సిద్దూ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించి అందరికీ షాక్ ఇచ్చారు. తనకు ఢిల్లీ రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన తేల్చిచెప్పారు. తనకు ఎమ్మెల్యేగా ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉందని, కర్ణాటక ప్రజల మధ్యే ఉంటూ యాక్టివ్ పాలిటిక్స్‌లో సేవలందిస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజీనామా అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గురువారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరిన సిద్దరామయ్య (CM Siddaramaiah) ప్రయాణానికి వాతావరణం అడ్డుకట్ట వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా జైపూర్‌కు మళ్లించారు. దీంతో రాహుల్ గాంధీతో జరగాల్సిన ఆయన కీలక భేటీ శుక్రవారానికి వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి







