సుప్రీంకోర్టు షాక్.. రూ. 2.5 లక్షల కోట్ల పన్నుతో ఆ కంపెనీలు మూతపడతాయా?
ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు, ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న దిగ్గజ కంపెనీలకు భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ఊహించని షాక్ ఇచ్చింది. కోర్టిచ్చిన సంచలన తీర్పుతో గేమింగ్ ఇండస్ట్రీ పునాదులు కదిలిపోయాయి. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులు డిపాజిట్ చేసే పూర్తి మొత్తంపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయడం ముమ్మాటికీ రాజ్యాంగబద్ధమేనని కోర్టు కుండబద్దలు కొట్టింది.
రాష్ట్రాలకే ఫుల్ పవర్స్!
కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానాన్ని సవాలు చేస్తూ డెల్టా కార్ప్ సహా పలు ప్రముఖ గేమింగ్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) నిర్దాక్షిణ్యంగా కొట్టివేసింది. జీఎస్టీ చట్టం నిబంధనల ప్రకారం ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు ‘యాక్షనబుల్ క్లెయిమ్స్’ పరిధిలోకి వస్తాయని, అందువల్ల వాటిపై కచ్చితంగా పన్ను విధించే హక్కు ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ఇదే సమయంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్-మనీ ఆన్లైన్ గేమింగ్‌ను తమ రాష్ట్ర పరిధిలో నియంత్రించడానికి లేదా పూర్తిగా నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు విశేషాధికారం ఉందని తేల్చి చెప్పింది. గతంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆన్లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ చట్టాలు తేగా.. ఆ చట్టాలను ఆయా రాష్ట్రాల హైకోర్టులు రద్దు చేశాయి. ఇప్పుడు ఆ హైకోర్టుల తీర్పులను సుప్రీంకోర్టు (Supreme Court) పక్కనబెడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే పెద్దపీట వేసింది.
లక్షల కోట్ల ట్యాక్స్ భారం..
ఈ వ్యవహారంలో గేమింగ్ కంపెనీలకు గతంలో న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా తాజాగా రద్దు చేసింది. కేవలం ట్యాక్స్ అధికారుల నుంచి అందిన షో-కాజ్ నోటీసులపై వివరణ ఇచ్చుకునే హక్కును మాత్రమే సంస్థలకు మిగిల్చింది. ఈ తీర్పు ప్రభావం ఇప్పుడు దేశీయ రియల్-మనీ గేమింగ్ రంగంపై వినాశకరంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, గత బకాయిలతో కలిపి (రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్) గేమింగ్ రంగంపై ఏకంగా రూ. 2.5 లక్షల కోట్ల మేర భారీ జీఎస్టీ డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. తాజా తీర్పుతో (Supreme Court) కంపెనీలు ఇప్పుడు ఈ భారీ పన్ను భారంతో పాటుగా, దానికి వడ్డీలు, జరిమానాలు సైతం చెల్లించక తప్పని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 28 శాతం పన్ను పోటు వల్ల అనేక ఆపరేటర్లు తమ వ్యాపారాలను కుదించుకున్నారు. నష్టాలను భరించలేక పలు సంస్థల్లో భారీగా ఉద్యోగుల కోతలు (Layoffs) సైతం జరిగాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో గేమింగ్ రంగంలో కొత్త పెట్టుబడులు రావడం గగనమేనని, భవిష్యత్ కార్యకలాపాలపై తీవ్ర అనిశ్చితి నెలకొందని ఇండస్ట్రీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి







