ఈసీ నిర్ణయంలో తప్పే లేదన్న సుప్రీం.. మమతకు షాక్
ఎన్నికల కౌంటింగ్ కి కొన్ని గంటల ముందుకు బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఓట్ల లెక్కింపులో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను సిబ్బందిగా ఎంపిక చేసుకునే అధికారం ఎన్నికల సంఘానికి వుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 13 నాడు ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ ను తప్పని తాము చెప్పలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ మొదట కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. అయితే.. ఈసీ నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదని పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది.
శనివారం సెలవు అయినా సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. తృణమూల్ పక్షాన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కౌంటింగ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే వుండాలన్న రూల్ ఏమీ లేదని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధం కానే కాదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కలిసే కౌంటింగ్ లో వుంటారని ఈసీ స్పష్టంగా తన సర్క్యులర్ లో పేర్కొంది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయన్న టీఎంసీ ఆందోళనలు నిరాధారమైనవని ఈసీ పేర్కొంది.







