గ్యాస్ కొరత లేదంటున్న అధికారులు.. మరి సిలిండర్ల డెలివరీలో ఎందుకీ జాప్యం?
LPG Gas: నగర పరిధిలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఏజెన్సీల తీరు వల్ల బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు రెండు నుండి మూడు వారాలైనా సిలిండర్లు రావడం లేదు.
సుమారు 33 లక్షల కనెక్షన్లు..
నిజానికి బుకింగ్ సీరియల్ నంబర్ ప్రకారమే సిలిండర్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ డీలర్లు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరతను సాకుగా చూపుతూ, ఇళ్లకు సరఫరా చేయాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, హాస్టళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎక్కువ ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 33 లక్షల కనెక్షన్లు ఉండగా.. సాధారణంగా రోజుకు 70 వేల బుకింగ్లు జరిగేవి. అయితే, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత 25 రోజుల గడువు ముగియగానే ఒక్కసారిగా బుకింగ్స్ పెరగడంతో ఆ సంఖ్య రోజుకు లక్ష దాటుతోంది.
పనిచేయని ఫోన్లు..
వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ ఎప్పుడొస్తుందనే కనీస సమాచారం కూడా ఏజెన్సీల నుండి లభించడం లేదు. చాలా ఏజెన్సీల పాత ఫోన్ నంబర్లు నిరంతరం బిజీగా రావడం లేదా అస్సలు పనిచేయకపోవడం గమనార్హం. కొన్ని ఏజెన్సీలు కొత్త నంబర్లు వాడుతున్నప్పటికీ, వినియోగదారులకు వాటి వివరాలు తెలియడం లేదు. గ్యాస్ కోసం వినియోగదారుడే స్వయంగా ఏజెన్సీ ఆఫీసుకు వెళ్లి గొడవపడితే తప్ప సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది.
ఫిర్యాదు చేస్తేనే స్పందన..
ఒక వినియోగదారుడు గత నెల 27న సిలిండర్ బుక్ చేసుకోగా, మూడు వారాలైనా సరఫరా కాలేదు. ఏజెన్సీకి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, చివరికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ నెల 23న (దాదాపు నెల రోజులకు) ఆయనకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేశారు. గ్యాస్ ఏజెన్సీల ఈ మాయాజాలంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.







