ప్రాణాంతక కంటి క్యాన్సర్‌కు చెక్.. శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన
Eye Cancer: ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెత ప్రకారం.. క్యాన్సర్ కణాన్ని అదే క్యాన్సర్ కణంతో అడ్డుకోవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH), ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (LVPEI) శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ కీలక విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే కంటి క్యాన్సర్ ‘రెటినోబ్లాస్టోమా’ (Retinoblastoma) కొందరిలో ఎందుకు ప్రాణాంతకంగా మారుతుందనే రహస్యాన్ని ఈ పరిశోధన ద్వారా గుర్తించారు. సాధారణంగా ఈ క్యాన్సర్ కంటికే పరిమితమైతే 95 శాతం మంది పిల్లలు కోలుకుంటారు. కానీ, కొందరిలో ఇది రక్తం ద్వారా బోన్‌మ్యారోకు (ఎముక మజ్జ) వ్యాపిస్తుంది. అక్కడ క్యాన్సర్ కణాలు చేరితే కీమోథెరపీ కూడా పనిచేయదు, దీంతో రోగి పరిస్థితి విషమంగా మారుతుంది.
పరిశోధనలో తేలిన అంశాలు..
హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గీతా వేముగంటి, స్కాలర్ జ్యోతి అట్టెం, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ స్వాతి కలికి కలిసి ఈ పరిశోధన చేశారు. కంటిలోని క్యాన్సర్ కణాలు ‘స్మాల్ ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ (ఎస్ఈవీఎస్) అనే చిన్న బుడగల్లాంటి కణాలను విడుదల చేస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి బోన్మ్యారోలోని మెసెంఖైమల్ స్టెమ్ కణాలతో కలిసిపోతాయి. ఈ స్టెమ్ కణాలు సాధారణంగా గాయాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి, కానీ క్యాన్సర్ కణాలు వీటిని తమకు అనుకూలంగా మార్చుకుంటాయి.
వ్యాధి నిరోధక శక్తిని అణచివేస్తూ..
క్యాన్సర్ ఒకచోటు నుండి మరోచోటుకు వ్యాపించడం అంత సులువు కాదు. అయితే ఈ ఎస్ఈవీలు మాలిక్యులర్ మెసెంజర్లుగా పనిచేస్తూ కొత్త ప్రాంతానికి చేరగానే అక్కడి పరిసరాలను మార్చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని అణచివేస్తూ రక్తం సరఫరాను పెంచుకుంటాయి. ప్రయోగశాలలో బోన్‌మ్యారో కణాలు, క్యాన్సర్ కణాల ఎస్ఈవీలను ఒకదానికొకటి ఎక్స్పోజ్ చేయగా.. బోన్‌మ్యారో కణాలు మరింత వేగంగా కదిలి క్యాన్సర్‌కు సంబంధించిన ప్రోటీన్లను విడుదల చేశాయి. మరోవైపు కణితి కణాల్లో క్యాన్సర్ స్టెమ్ సెల్ ప్రోటీన్లు పెరగడం వల్ల కీమోథెరపీకి కూడా లొంగకుండా బోన్‌మ్యారోలో క్యాన్సర్ ఉధృతి పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
భవిష్యత్తుపై కొత్త ఆశలు..
ఈ ఇన్-విట్రో మోడల్ పరిశోధన క్యాన్సర్ చికిత్సలో సరికొత్త మార్గాలను చూపిస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్మాల్ ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్నే డ్రగ్ వెహికల్స్‌గా (మందులను మోసుకెళ్లే సాధనాలుగా) మార్చి, నేరుగా క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ పంపే బుడగల్లాంటి కణాల ద్వారానే ఔషధాన్ని పంపి, తిరిగి క్యాన్సర్‌పైనే ప్రయోగించవచ్చు. అంటే క్యాన్సర్ కణాలతోనే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని వారు వివరిస్తున్నారు.







